ప్రభుత్వ వైద్య సేవల్లో మూడో స్థానంలో తెలంగాణ : హరీశ్ రావు
దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య సేవల్లో దేశంలో మూడో స్థానంలో తెలంగాణ ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రెండో విడత కంటివెలుగు కార్యక్రమం అమలు, నిర్వహణ గురించి ఆయన మాట్లాడుతూ.. అంధత్వ నివారణ చర్యలో భాగంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. కంటి చూపు కోల్పోయిన వాళ్లకు ఈ పథకం భరోసా అని, పేద ప్రజల్లో రెటినోపతి సమస్య తీవ్రంగా ఉందని ఆయన చెప్పారు. అందుకని ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేసుకోవాలని రాష్ట్ర ప్రజలను కోరారు. 100 రోజుల్లో 1.54 కోట్లమందికి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు.ఒక్కో బృందంలో..
కంటి వెలుగు పరీక్షలు చేసే ఒక్కో బృందంలో ఒక వైద్యాధికారి, ఒక అప్టోమెట్రిస్ట్, ఇద్దరు లేదా ముగ్గురు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఉంటారని హరీశ్ రావు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు మందులు, కళ్లద్దాలు చేరాయని ఆయన వెల్లడించారు. ప్రజుల షెడ్యూల్ ప్రకారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి కంటివెలుగు ఆహ్వాన పత్రిక అందేలా చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు, అధికారులను ఆయన ఆదేశించారు. అంతేకాదు వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా సకాలంలో క్యాంపులు ప్రారంభించేలా పర్యవేక్షణ చేస్తామని అన్నారు. కంటి వెలుగు క్యాంపులకు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని మంత్రి సూచించారు.క్యాంప్ నిర్వహణకు ప్రతి గ్రామ పంచాయతికి వైద్య ఆరోగ్యశాఖ నుంచి రోజుకు రూ. 1000, క్యాంప్‌లోని డాక్టర్ల బృందానికి రూ.1500 ఇస్తామని మంత్రి వెల్లడించారు. ఈసారి తెలంగాణ కంపెనీల నుంచి కళ్లజోళ్లను కొనుగోలు చేశామని మంత్రి చెప్పారు. జిల్లా కలెక్టర్లు, ప్రజాపతినిధిలు, అధికారులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కోరారు. ఈనెల 18న రెండో విడత కంటివెలుగును హరీశ్ రావు ఖమ్మంలో ప్రారంభించనున్నారు.