ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీగా రిజిస్టర్‌ చేసి.. 

అక్రమంగా బాణసంచా నిల్వలు
– అందుకే అగ్నిప్రమాదం జరగడంతో భారీ పేలుళ్లు జరిగాయి
– ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కు తాళంవేసి ఉండటంతో 17మంది సజీవదహనమయ్యారు
– ఢిల్లీ అగ్నిప్రమాదంలో వెలుగులోకి ఆసక్తికర విషయాలు
న్యూఢిల్లీ, జనవరి22(జ‌నంసాక్షి) : దేశరాజధాని ఢిల్లీలో గత శనివారం చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించి కీలక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తర ఢిల్లీలోని బావనా పారిశ్రామికవాడలో గల బాణసంచా కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన కర్మాగారాన్ని ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీగా రిజిస్టర్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్లాస్టిక్‌ తయారీ పేరుతో ప్రారంభించిన ఈ భవనంలో అక్రమంగా బాణసంచా ప్యాకేజీ, స్టోరేజీ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన అనంతరం పోలీసులు విచారణ చేపట్టగా.. ఆ భవవాన్ని మనోజ్‌ జైన్‌ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. ఆ కర్మాగారాన్ని ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీగా రిజిస్టర్‌ చేయించిన జైన్‌.. గత కొన్ని రోజులుగా అక్రమ కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాణసంచా తయారీదారుల నుంచి పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి ఈ భవనంలో ప్యాకింగ్‌ పనులు చేపట్టినట్లు తెలిసింది. అంతేగాక.. భవనంలోని చాలా చోట్ల అధిక తీవ్రత గల పేలుడు పదార్థాలను భద్రపరిచినట్లు పోలీసుల విచారణలో తేలింది. అగ్నిప్రమాదం జరగడంతో ఆ పేలుడు పదార్థాలన్నీ అంటుకుని పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ప్రమాదం సమయంలో భవనంలోని ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కు తాళం వేయడంతో సిబ్బంది బయటకు రాలేకపోయారు. దీంతో వారంతా సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై శిక్షార్హమైన నేరం కింద కేసు నమోదుచేసుకున్న పోలీసులు జైన్‌ను అరెస్టు చేశారు.