ప‌ళ‌ని విశ్వాస ప‌రీక్ష‌పై మ‌ద్రాస్ హైకోర్టుకు డీఎంకే

Tamil-Nadu-Assemblyచెన్నై: తమిళనాడు అసెంబ్లీలో గత శనివారం నిర్వహించిన బలపరీక్ష చెల్లదంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కోర్టుకెక్కింది. ప్రతిపక్షాలు లేకుండానే అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్ష చెల్లదని ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ నుంచి డీఎంకే సభ్యులను బలవంతంగా గెంటేసిన విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించింది. బలపరీక్షలో భాగంగా రహస్య ఓటింగ్‌ను చేపట్టాలని కోరినా స్పీకర్‌ ధన్‌పాల్‌ పట్టించుకోలేదని, తమను సభ నుంచి బయటకు గెంటేశారని, మార్షల్స్‌ తమపై దాడికి పాల్పడ్డారని డీఎంకే పిటిషన్‌లో ఆరోపించింది. ప్రతిపక్ష సభ్యులు లేకుండా సభలో జరిగిన విశ్వాస పరీక్ష ఏ రకంగానూ చెల్లదని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా స్వీకరించాలని డీఎంకే తరపు న్యాయవాది కోరగా మంగళవారం విచారణ చేపడతామని న్యాయమూర్తులు జస్టిస్‌ జి.రమేష్‌, మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

బలపరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళ పరిస్థితులపై ఇప్పటికే తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు నివేదిక కోరిన సంగతి తెలిసిందే. బలపరీక్ష సందర్భంగా సభలో చోటుచేసుకున్న ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆయన అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు.