ఫసల్‌బీమాతో రైతులను ఆదుకోండి

కేంద్రపథకాన్ని విస్తృతం చేయాలి

నిజామాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్‌ కిసాన్‌సంఘ్‌ జిల్లా నాయకులు చేశారు.అనేకమంది రైతులు ఫసల్‌ బీమా చేసుకున్నారని, అయినా నష్టపోయిన వారికి బీమా అందడం లేదని తెలిపారు. బీమా కంపెనీలకు ప్రభుత్వ వాటాను చెల్లించి తక్షణమే పరిహారం విడుదలయ్యే చూడాలని కోరారు. రైతులకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పంటబీమా చెల్లింపులు తక్షణమే చేయాలని డిమాండ్‌ చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో అన్నదాతలు అప్పుల పాలు కావాల్సి వస్తుందని పేర్కొన్నారు. గతేడాది అధిక వర్షాల వల్ల పంటలు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని తెలిపారు. వ్యవసాయ అధికారులు, బీమా కంపెనీల వారు నష్టపరిహారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధరించారని అన్నారు. అఖిల భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించి సమస్యను అధికారుల దృష్టికి తీసుకుని వస్తున్నామని అన్నారు. గతేడాది వేసిన పత్తి, సోయా, పెసర, మినప పంటలకు రైతులు బీమా చేసినా ఇప్పటి వరకు డబ్బులురాలేదని అన్నారు. ఇదిలావుంటే చాలామంది రైతులు తోటి రైతులను అనుసరిస్తూ యాజమాన్యం చేపడతారని అందుకే నష్టపోతున్నారని వ్యవసాయవేత్తలు అన్నారు. ఇలాకాకుండా వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు, శాస్త్రవేత్తల సూచనలను పాటించాలన్నారు. లైసెన్సు కలిగిన డీలర్లవద్ద బిల్లులపైనే విత్తనాలు, పురుగుమందులు, ఎరువులను కొనాలి. పంటలపై సమస్యలువస్తే అధికారులు లేదా శాస్త్రవేత్తలను సంప్రదించాలని, నేరుగా దుకాణాల్లో మందులను కొని పిచికారి చేయవద్దన్నారు. బిందుసేద్యం పాటిస్తే నీటిపొదుపు సాధ్యపడుతుందన్నారు. భూసార పరీక్షల ఫలితాలను అనుగుణంగానే రసాయన ఎరువులను వాడాలి. అనవసరంగా పురుగు తెగుళ్ల మందులను వాడకుండా సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అవలంబించాలి. తొలకరి వర్షాలకు విత్తుకున్న పచ్చిరొట్ట పైర్లయిన పెసర, జనుము, జీలుగలను తగిన అదునులో నేలలో కలియదున్నుకుని వరినాట్లను వేయాలని సూచించారు.