ఫిరాయింపులపై జోక్యం చేసుకోలేం
– హైకోర్టు
హైదరాబాద్,సెప్టెంబర్28(జనంసాక్షి): పార్టీ ఫిరాయింపులపై విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు టిడిపి తదితర నేతలు వేసిన కేసును కొట్టి వేసింది. అనర్హత విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయం అని పేర్కొంది. వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉన్నందున దీనిపై ఇప్పుడే తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో తెలంగాణలో వివిధ పార్టీల నుంచి అధికార టిఆర్‌ఎస్‌లో చేరిన పలువురు ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట లభించింది. పదవికి రాజీనామా చేయకుండా తమ ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్లారంటూ టిడిపి, కాంగ్రెస్, వైకాపాలు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ తాము ఇచ్చిన పిటిషన్‌లు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని… వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేలా ఆదేశించాలని పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై పలు దఫాలుగా వాదనలు విన్న న్యాయస్థానం ఆ పిటిషన్లను తోసిపుచ్చింది. స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలపై అందిన ఫిర్యాదులు వీలైనంత త్వరగా స్పీకర్ పరిష్కరిస్తారని భావిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. తెలంగాణలో ఫార్టీలు మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఇబ్బంది కలగ లేదు.పార్టీ ఫిరాయించినవారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ టిడిపి, కాంగ్రెస్,వైఎస్ ఆర్ కాంగ్రెస్ లు హైకోర్టుకు వెళ్లాయి. ఈ పిటిషన్ లపై విచారణ చేసిన హైకోర్టు వాటిని తోసిపుచ్చింది.ఫిరాయింపుల వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉన్నందున తామేవిూ చేయలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది.అయితే స్పీకర్ దీనిపై తర్వగా నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా హైకోర్టు సూచించింది. దీంతో టిఆర్‌ఎస్ లో చేరిన టిడిపి , కాంగ్రెస్ ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఊరట దక్కింది. ముఖ్యంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు ఇది పెద్ద ఊరట అని చెప్పాలి. అయితే దీనివల్ల పార్టీ ఫిరాయింపులు చేసినవారికి మరింత ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు మిగితా ఏడుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, మంచిరెడ్డి తదితరులు ఇందులో ఉన్నారు. స్పీకర్ పరిధిలో ఉన్నందున కోర్టు జోక్యం చేసుకోలేమని కోర్టు తెలిపింది. స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట రాలేదని , తాము సుప్రింకోర్టుకు వెళతామని టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. స్పీకర్ త్వరగా చర్య తీసుకోవాలని హైకోర్టు సూచించిందని ఆయన అన్నారు. కనుక స్పీకర్ దీనిపై వెంటనే చర్య చేపట్టవలసిన అవసరం ఉందని అన్నారు. ఆ మేరకు మరోమారు తాము ఒత్తడి తెస్తామని అన్నారు. హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకం కూడా కాదని, దీనిపై తాము సుప్రింకోర్టుకు వెళతామని రావుల చెప్పారు. తెలంగాణ శాసనసభలో టిడిపినేత ఎర్రబెల్లి దయాకరరావు అరెస్టు అక్రమమని ఆయన అన్నారు. డిజిపికి దీనిపై ఫిర్యాదు చేస్తున్నామని టిడిపి నేతలు చెప్పారు. వీరంతా ఎర్రబెల్లిని కలుసుకునేందుకు జనగామ వెళ్లారు.