ఫీల్డ్ అసిస్టెంట్ల ఛలో విజయవాడ
వారి జీతాలు పెంచాలన్న ఎమ్మెల్సీ
విజయవాడ,మార్చి9(జనం సాక్షి): రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్‌లు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో వివిధ జిల్లాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్‌లు తరలివచ్చారు. విజయవాడలోని ధర్నా చౌక్‌వద్ద చేపట్టిన
నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు, కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ఉపాధి హావిూ ఫీల్డ్ అసిస్టెంట్‌ల సమస్యలను శాసనమండలిలో చర్చకు పెడతామన్నారు. 2005 నుంచి జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పధకం అమలవుతుందని, పీల్ అసిస్టెంట్‌ల శ్రమ వల్లే ఇంత కాలంగా ఇది సాగుతోందన్నారు. ప్రభుత్వానికి అవార్డులు వచ్చాయంటే వారి కృషి వల్లే అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌లకు ఇచ్చే రూ. 8వేల వేతనంతో కుటుంబం ఎలా గడుస్తుందని లక్ష్మణరావు ప్రశ్నించారు. వైసీపీని గెలిపిస్తే జీతం పెంచుతానన్న జగన్ మాట తప్పి మోసం చేశారని విమర్శించారు. మిశ్రా కమిటీ నివేదిక ప్రకారం కనీస వేతనం రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలా నియోజకవర్గాలలో రాజకీయ వేధింపులు పెరిగాయని, ఏ ఇబ్బందులు లేకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని, వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు.