ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొంగోని సురేష్ గౌడ్
చేర్యాల (జనంసాక్షి) జులై 09 : ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బొంగోని సురేష్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణ కేంద్రంలో బీజేవైఎం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొంగోని సురేష్ గౌడ్ హాజరై మాట్లాడుతూ.. ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లో నుంచి తొలగించి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు విధుల్లోకి తీసుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 7651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఎప్పుడు విధుల్లోకి తీసుకుంటారా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి, బీజేవైఎం పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని చెప్పడం జరిగిందని, దాదాపు 110 రోజులు గడుస్తున్నా నేటికీ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆర్డర్ కాపీలు అందక ఏం జరుగుతుందని తెలియక అయోమయంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారని, పని భారం రాజకీయ ఒత్తిళ్ళను తట్టుకొని 14 సంవత్సరాలుగా సేవలు అందించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించడం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొన్నదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి సోగాల మనోజ్ కుమార్, చేర్యాల రూరల్ మద్దూరు, దూల్మిట్ట మండలాల అధ్యక్షులు మాచర్ల ప్రవీణ్ గౌడ్, యామ శ్రీకాంత్, కాసోజు అఖిల్ చారి, మండల ప్రధాన కార్యదర్శులు ఆరె శేఖర్, సల్ల అజయ్ తదితరులు పాల్గొన్నారు.