ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన..
స్పెయిన్ ఆటగాడు ఆండ్రెస్
– ఓటమిని తట్టుకోలేక అంతర్జాతీయ కెరిర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడి
మాస్కో, జులై2(జనం సాక్షి ) : ఏ ఆటలోనైనా గెలుపోటములు సహజం. కానీ, ఒక అంతర్జాతీయ ఆటగాడు ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో తన జట్టు క్వార్టర్స్ చేరలేకపోయిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అంతేకాదు ఆ క్షణంలో తన కెరీర్‌కు ముగింపు పలికాడు. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించేశాడు. ఇంతకీ అతడు ఎవరంటే స్పెయిన్ ఫుట్‌బాల ఆటగాడు ఆండ్రెస్. రష్యా వేదికగా జరుగుతోన్న ఫిఫా ప్రపంచకప్ పోటీల్లో స్పెయిన్ నాకౌట్ దశలోనే వెనుదిరిగింది. ఆతిథ్య రష్యాతో జరిగిన మ్యాచ్‌లో 4-3 తేడాతో ఓడిపోయి ప్రపంచకప్ నుంచి నిష్కమ్రించింది. మాజీ ప్రపంచ ఛాంపియన్ స్పెయిన్ ఓటమితో ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో 34 ఏళ్ల స్పెయిన్ ఆటగాడు, మిడ్‌ఫీల్డర్ ఆండ్రెస్ మాట్లాడుతూ… ‘జాతీయ జట్టు తరఫున చివరి మ్యాచ్ ఆడేశాను. ఇది నిజం. కెరీర్ గొప్పగా ముగించాలని ఎన్నో కలలు కంటుంటాం. కానీ, ఒక్కోసారి అవి నిజం కావు. నా కెరీర్‌లో ఇదే అత్యంత బాధాకరమైన రోజు అని తెలిపాడు. స్పెయిన్ తరఫున ఆండ్రెస్ 131 మ్యాచ్‌లు ఆడి 13 గోల్స్ సాధించాడు. కొద్ది రోజుల క్రితం స్పెయిన్ చేతిలో ఓడి గ్రూప్ దశలోనే నిష్కమ్రించడంతో ఇరాన్ ఆటగాడు సర్దార్ అజ్‌మౌన్ 23 ఏళ్లకే అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రూప్ దశ దాటడమే కష్టమనుకున్న రష్యా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ క్వార్టర్స్ చేరుకుంది. తనకన్నా ఎన్నో రెట్లు బలమైన స్పెయిన్‌కు షూటౌట్లో షాకిచ్చి ఫుట్‌బాల్ పండితుల అంచనాలను తారుమారు చేసింది రష్యా. దీంతో ఆతిథ్య దేశంలో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.