ఫుడ్‌ పాయిజన్‌ తో బాలుడు మృతి

పెద్దపల్లి,జనవరి3(జ‌నంసాక్షి): విషతుల్యమైన ఆహరం తీసుకోవడంతో బాలుడు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.జిల్లాలోని కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్డుకు చెందిన రుషిక్‌ (3) అనే బాలుడు కోడికూర విషతుల్యమై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కమాన్‌పూర్‌లోని క్రాస్‌ రోడ్డు వద్ద నివాసముంటున్న కామేర శంకర్‌, పద్మలకు కుమారుడు రుషిక్‌. అయితే బుధవారం ముగ్గురు మధ్యాహ్నం కోడికూర తిన్నారు. తిన్న వెంటనే శంకర్‌, పద్మతోపాటు బాలుడికి కూడా వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకున్నారు. కాగా… బాలుడికి బుధవారం అర్థరాత్రి మళ్లీ వాంతులు, విరేచనాలు కావడంతో పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే… కరీంనగర్‌ వైద్యులు పరిశీలించి అప్పటికే బాలుడు మృతి చెందాడని తెలిపారు. ఒక్కొగానొక్క కుమారుడు మృతి చెందడంతో ఆతల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కోడికూర తినడం వల్ల ఫుడ్‌ పాయిజన్‌ అవడంతో బాలుడు మృతిచెందాడని తెలుస్తోంది.