ఫేస్బుక్ను హ్యాక్ చేసింది వాళ్లేనా?
న్యూఢిల్లీ: ఫేస్బుక్ అంతరాయం కలగడానికి సాంకేతిక సమస్య కారణమా లేక హ్యాకింగ్ చేయడం వల్లనా? దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మలేసియా ఎయిర్ లైన్స్ వెబ్సైట్పై ఇటీవల దాడి చేసిన హ్యాకర్లే ఫేస్బుక్కు అంతరాయం కలిగించి ఉండొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఉగ్రవాదుల మద్దతుదారులు లిజర్డ్ స్క్వాడ్.. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ఫేస్బుక్తో పాటు ఇన్స్టాగ్రామ్ను స్తంభింపజేసినట్టు ట్విట్టర్లో పేర్కొంది.
ఫేస్ బుక్ సహా , వాట్సప్ మెసెంజర్లు మంగళవారం మధ్యాహ్న ప్రాంతంలో స్తంభించిన సంగతి తెలిసిందే. సాంకేతిక సమస్యలు వల్ల ఆగిపోయినట్టు భావించారు. అయితే తామే అంతరాయం కలిగించామని మంగళవారం సాయంత్రం లిజర్డ్ స్క్వాడ్ ట్వీట్ చేసింది. మలేసియా ఎయిర్లైన్స్ ఈమెయిల్ తమ ఆధీనంలోనే ఉందంటూ వెంటవెంటనే ట్వీట్లు పెట్టారు.
కాగా ఫేస్బుక్ యాజమాన్యం ఈ ఆరోపణలను అవాస్తమని పేర్కొంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాదారులు అసౌకర్యం చెందిన మాట వాస్తవమేనని, అయితే ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ఫేస్బుక్లో ఓ మార్పు చేయడం వల్ల సాంకేతిక సమస్య తలెత్తిందని, వెంటనే దీన్ని సరిచేశామని తెలియజేసింది.