ఫేస్‌బుక్‌ సీఈఓకు భారత కోర్టు సమన్లు

భోపాల్‌: ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌కు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ కోర్టు సమన్లు పంపింది. స్థానిక స్టార్టప్‌ సంస్థ ‘ది ట్రేడ్‌బుక్‌.ఆర్గ్‌’ ఫిర్యాదు మేరకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. జూన్‌ 20న జుకర్‌బర్గ్‌ కోర్టులో హాజరుకావాలని అదనపు సెషన్స్‌ జడ్జీ పార్థశంకర్‌ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు.

భోపాల్‌కు చెందిన స్వప్నిల్‌ రాయ్‌ ‘దిట్రేడ్‌బుక్‌.ఆర్గ్‌’ అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. ఇదో బిజినెస్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫాం. దీని ప్రచారం కోసం ఫేస్‌బుక్‌లో పెయిడ్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ ఇచ్చారు స్వప్నిల్‌. అయితే మూడు రోజులు తన యాడ్‌ను వేసిన ఫేస్‌బుక్ ఆ తర్వాత నిలిపివేసిందని స్వప్పిల్‌ ఆరోపించారు. అంతేగాక తన పోర్టల్‌ ‘దిట్రేడ్‌బుక్‌.ఆర్గ్‌’ పేరు అభ్యంతరకరంగా ఉందంటూ ఫేస్‌బుక్‌ లీగల్‌ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

దీనిపై కోర్టును ఆశ్రయించిన స్వప్నిల్‌ ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా దావా వేశారు. ఫేస్‌బుక్‌ తీరుతో తాను మానసిక ఒత్తిడికి గురవతున్నట్లు ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఫేస్‌బుక్‌ అధినేత జుకర్‌బర్గ్‌కు సమన్లు జారీ చేసింది.