ఫేస్‌బుక్ ఇండియా కొత్త ఎండీగా ఉమంగ్ బేడీ

బెంగళూరు: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇండియా ఎండీగా ఉమంగ్ బేడీ నియమితులయ్యారు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన అడోబ్‌లో దక్షిణ భారత దేశానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఉమంగ్ బేడీ.. ఆ సంస్థ అభివృద్ధి కోసం కృషి చేశారు. ఇండియాలో అడోబ్ మార్కెట్స్ పెరగడంలో ప్రధాన పాత్ర పోషించారు. భారత్‌లోని అన్ని ప్రముఖ సంస్థలతో ఉమంగ్‌కు ఉన్న సత్సంబంధాలు, ఆయన పనితీరుని గమనించిన ఫేస్‌బుక్.. ఆయనను ఇండియా ఎండీగా నియమించింది.
ప్రస్తుతం ఇండియా ఎండీగా ఉన్న కీర్తిగారెడ్డిని అమెరికాకు బదిలీచేసింది. అక్కడ ఫేస్‌బుక్ గ్లోబల్ అకౌంట్స్ టీమ్‌కు ఆమె నాయకత్వం వహిస్తారని, అంతర్జాతీయ అడ్వర్టయిజ్ మెంట్స్ సంస్థలతో ఫేస్‌బుక్‌కు సత్సంబంధాలు పెరగడానికి ఆమె కృషి చేస్తారని ఆ సంస్థ పేర్కొంది. బేడీకి ఉన్న లీడర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్‌తో భారత్‌లో ఫేస్‌బుక్‌కు సేల్స్, మార్కెటింగ్, పార్ట్‌నర్‌షిప్స్ పెరుగుతాయని ఫేస్‌బుక్ ధీమా వ్యక్తం చేస్తోంది. బేడీ జూలైలో అధికారికంగా బాధ్యలు చేపడుతారని, కీర్తిగా ఆగస్ట్‌లో నూతన బాధ్యతలు స్వీకరిస్తారని ఫేస్‌బుక్ వెల్లడించింది. ఫేస్‌బుక్‌లో అవకాశం వచ్చినందుకు తానెంతో ఎగ్జయిటింగ్‌  అవుతున్నానని, ఫేస్‌బుక్‌లో బాధ్యతలు స్వీకరించడానికి ఆతృతతో ఎదురుచూస్తున్నానని ఉమంగ్ బేడీ తన టైమ్‌లైన్‌లో పేర్కొన్నారు.