ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను కలిసేందుకు స్నేహితురాలితో వెళ్లిందో యువతి..

కువైట్: సోషల్ మీడియా రాకతో ఎంతో కొంత మేలు కలుగుతున్నా.. జరుగుతున్న చెడు మాత్రం తక్కువేమీ కాదు. ప్రపంచ అవథులను తగ్గించేసిందని సోషల్ మీడియా గురించి చెప్పుకుంటున్నా.. కొత్త కొత్త మోసాలకు నాంది పలికిందనే మాట మాత్రం వాస్తవం. తెలియని వారితో స్నేహం.. ఆపై మోసపోవడం.. వంటివి కోకొల్లలు. అలాంటి ఘటనే ఒకటి కువైట్‌లో జరిగింది. కువైట్‌లోని సోమలి ప్రాంతానికి చెందిన ఓ యువతికి ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడిది కూడా కువైట్ కావడంతో స్నేహం ఇంకాస్త ఎక్కువైంది. కొద్ది రోజుల చాటింగ్ తర్వాత ఇరువురూ కలుసుకుందామనుకున్నారు. క్వాడిసియా ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు తన స్నేహితురాలితో వస్తానని ఆ యువకుడికి చెప్పిందా యువతి. అన్నట్లుగానే తన స్నేహితురాలితో కలిసి చెప్పిన రెస్టారెంట్‌కు అనుకున్న సమయానికి చేరింది. కొద్ది సేపటి తర్వాత తన స్నేహితుడితో  కలిసి ఆమె దగ్గరకు వచ్చాడా ఫేస్‌బుక్ ఫ్రెండ్. కొద్దిసేపు మాట్లాడి.. తిని.. అలా షికారు కెళదాం రమ్మని వారిని ఆహ్వానించాడు. తెలిసిన ప్రాంతమే కావడంతో ఇద్దరు యువతులూ వారితో కలసి వారి కారు ఎక్కారు. కారు ఎక్కడం ఆలస్యం.. రయ్యిమంటూ స్పీడు పెంచి.. నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. ఇద్దరు యువకులూ.. వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఆ ఇద్దరు  యువతులు అహ్మది పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. యువతి చాటింగ్ చేసిన ఫేస్‌బుక్ అకౌంట్ నకిలీది కావడంతో అతడి వివరాలను కనుక్కోలేకపోయారు. పోన్ నెంబర్ ద్వారా.. కారు తిరిగిన ప్రాంతాల ఆధారంగా అతడిని వెతికే పనిలో పోలీసులు పడ్డారు.