ఫైజర్ వ్యాక్సిన్‌కు అమెరికా అత్యవసర అనుమతి
వాషింగ్టన్,డిసెంబరు 12 (జనంసాక్షి): అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీకి చెందిన బయో ఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈమేరకు వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతించింది. దేశంలో కరోనా కట్టడికి ఇది మార్గం సుగమం చేస్తుందని వెల్లడించింది.ఫైజర్ వినియోగంపై ఉన్న సందేహాలను తొలగించడానికి, అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఫైజర్ అత్యవసర వినియోగానికి ఎఫ్‌డీఏ అనుమతించింది.
24 గంటల్లోపు టీకా: ట్రంప్
ఈనేపథ్యంలో దేశంలో మొదటి టీకాను 24 గంటల్లోపు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫెడెక్స్, యూపీఎస్ భాగస్వామ్యంతో ఇప్పటికే దేశంలోని ప్రతి రాష్ట్రానికి వ్యాక్సిన్‌ను రవాణా చేయడం ప్రారంభించామన్నారు. మొదటి టీకాను ఎవరు వినియోగించాలనే విషయాన్ని ఆయా రాష్ట్రాల గవర్నర్లే నిర్ణయిస్తారని తెలిపారు. వయోవృద్ధులకు, ఆరోగ్య కార్యకర్తలు మొదటివరుసలో ఉంటారని చెప్పారు. దీనివల్ల కరోనా మరణాలు, కేసులు తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటన్ ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. దేశంలో గత మంగళవారమే వ్యాక్సినేసన్‌ను కూడా ప్రారంభించారు. 90 ఏండ్ల బామ్మకు తొలి టీకాను ఇచ్చారు. అయితే అలర్జీ ఉన్న వాళ్లు ఆ టీకాను వేసుకోవద్దని బ్రిటన్ ప్రభుత్వం ఆదేశించింది.