ఫైజర్‌ వ్యాక్సిన్‌కు 90 మార్కులు

వాషింగ్టన్‌,నవంబరు 9(జనంసాక్షి):యావత్‌ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తోన్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌పై తయారీ సంస్థలు మరికొంత పురోగతి సాధించాయి. ఇప్పటికే చాలా వ్యాక్సిన్‌లు తుది దశ ప్రయోగాల్లో ఉండగా, వీటిలో ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థలు కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ 90శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. సురక్షిత, సమర్థత కలిగిన వ్యాక్సిన్‌ను అందించడంలో కీలక దశను పూర్తి చేసుకున్నామని తాజాగా ఫైజర్‌ యాజమాన్యం పేర్కొంది. అత్యవసర వినియోగం కోసం నియంత్రణ సంస్థలకు అవసరమయ్యే సమాచారాన్ని విశ్లేషించామని, వ్యాక్సిన్‌ అనుమతికి మార్గం సుగమం చేయడంలో తాజా ఫలితాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఫైజర్‌ అభిప్రాయపడింది. ఒకవేళ ఈ ప్రక్రియ వేగంగా పూర్తయితే, త్వరలోనే అమెరికాలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సమాచారాన్ని త్వరలోనే అమెరికా నియంత్రణ సంస్థలకు ఫైజర్‌, బయోఎన్‌టెక్‌లు నివేదించే అవకాశం ఉంది.’కరోనా వైరస్‌ ధాటికి వణికిపోతున్న ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికా ప్రజలకు ఇది ఎంతో శుభవార్త’ అని ఫైజర్‌ ప్రతినిధి విలియం గ్రూబెర్‌ వెల్లడించారు. మేము ఆశించిన దానికంటే ఉత్తమ ఫలితాలు వచ్చాయని.. వ్యాక్సిన్‌ అభివృద్ధి పురోగతికి ఈ సమచారం ఎంతో కీలకమని ఆయన స్పష్టంచేశారు. తొలిదశలో వచ్చే వ్యాక్సిన్‌ల సమర్థత కేవలం 60శాతం నుంచి 70శాతం మాత్రమే ఉండే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశామని.. కానీ, తాజా ఫలితాలు మాత్రం 90శాతానికిపైగా సమర్థత కలిగి ఉండటం అసాధారణ విషయమని బయోఎన్‌టెక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఉగుర్‌ సాహిన్‌ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయగలమనే విషయాన్ని తాజా ఫలితాలు నిరూపిస్తున్నాయని.. ఇది ఒకరకంగా సైన్స్‌ సాధించిన విజయమని సాహిన్‌ అభిప్రాయపడ్డారు.’వ్యాక్సిన్‌ సమర్థతపై ఇప్పటివరకు కొన్ని వివరాలు మాత్రమే ఉందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు, ఇతర వయస్సుల వారిపై టీకా ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలియదు. వీటి విశ్లేషణను ఇంకా ప్రారంభించలేదు. అంతేకాకుండా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్నవారిలో దీని పనితీరుపై సమాచారం లేదు. ఈ ప్రయోగాల్లో పాల్గొన్న వారిలో ఎవ్వరికీ తీవ్రత ఎక్కువ లేకపోవడమే ఇందుకు కారణం. అయితే, వాటికి సంబంధించిన సమాచారం కూడా త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం’ అని విలియం గ్రూబెర్‌ స్పష్టం చేశారు.వ్యాక్సిన్‌ విడుదలకు నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం లభించాలంటే, తుది దశ ప్రయోగాల అనంతరం వాలంటీర్లకు సంబంధించి రెండు నెలల పూర్తి విశ్లేషణ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని ఫైజర్‌ సంస్థ నవంబర్‌ మూడో వారంలోనే అందించేందుకు సిద్ధమైంది. ఒక వేళ.. ఈ సమాచారంలో ఎలాంటి లోపాలు లేవని తేలితే, అమెరికాలో మరికొన్ని వారాల్లోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే యూరప్‌లో గత నెలలోనే ఫైజర్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ప్రయోగాల సమాచారంపై సవిూక్ష ప్రారంభమైంది. ఇప్పటివరకు ఎటువంటి తీవ్రమైన భద్రతా సమస్యలను పర్యవేక్షణ కమిటీ గుర్తించలేదని ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి.ఇదిలాఉంటే, మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్‌ తుదిదశ ప్రయోగ సమాచారాన్ని విశ్లేషించే పనిలో ఆ సంస్థ నిమగ్నమైంది. తాజా పురోగతి చూస్తుంటే.. త్వరలోనే ఈ రెండు వ్యాక్సిన్‌లు అత్యవసర వినియోగ అనుమతులు పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.