ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు బూస్టర్‌డోస్‌


` 15`18 ఏళ్ల వారికి జనవరి 3 నుంచి టీకాల పంపిణీ
` ఒమిక్రాన్‌ నివారణకు టీకాలు,జాగ్రత్తలే మందు..
` ఔషధాలకు ఎలాంటి కొరత లేదు
` ప్రధాని మోదీ ప్రకటన
దిల్లీ ,డిసెంబరు 25(జనంసాక్షి):ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయపెడుతున్న వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. జనవరి 10వ తేదీ నుంచి హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు బూస్టర్‌ డోసు అందిస్తామని ప్రకటించారు. వీరితో పాటు 60ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో ఉన్న వృద్ధులకు (వైద్యుల సలహా మేరకు) కూడా అదనపు డోసు పంపిణీ చేస్తామని వెల్లడిరచారు. అలాగే, 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి టీకా పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. శనివారం రాత్రి ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘‘దేశంలో 90 శాతం వయోజనులకు కొవిడ్‌ టీకా తొలి డోసు పంపిణీ పూర్తయింది. ఒమిక్రాన్‌పై రకరకాల వార్తలు, వదంతులు వస్తున్నాయి. వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీ కోసం నిరంతరం పనిచేస్తున్నాం. ఆరోగ్య కార్యకర్తల అంకితభావం వల్లే టీకా పంపిణీ వడివడిగా సాగుతోంది. రానున్న రోజుల్లో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేస్తాం’’ అని మోదీ అన్నారు.‘‘దేశంలో కరోనా ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదు. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న వేళ అందరం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. ఒమిక్రాన్‌ వస్తోంది.. ఎవరూ భయాందోళనకు గురికావొద్దు. కొత్త వేరియంట్‌ వల్ల పలు ప్రపంచ దేశాల్లో ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. మన దేశంలో కూడా కొన్ని కేసులు వచ్చాయి. ఎవరూ భయాందోళనకు గురికావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మాస్కులు, శానిటైజర్లు నిత్యం వాడండి. అప్రమత్తంగా ఉండండి. ఈరోజు దేశంలో 18లక్షల ఐసోలేషన్‌ పడకలు, ఐదు లక్షల ఆక్సిజన్‌ సపోర్టెడ్‌ పడకలు, 1.4లక్షల ఐసీయూ పడకలు, చిన్నారులకు 90వేల ప్రత్యేక బెడ్‌లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే, 3వేలకు పైగా పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు, నాలుగు లక్షల ఆక్సిజన్‌ సిలిండర్లు అన్ని రాష్ట్రాలకు సమకూర్చాం. దేశంలో ఔషధాలకు ఎలాంటి కొరతా లేదు’’ అని ప్రధాని చెప్పారు.‘‘ఒమిక్రాన్‌ నివారణకు టీకాలు, జాగ్రత్తలే మందు. అనేక రాష్ట్రాల్లో 100 శాతం కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయింది. కొత్త సంవత్సరం కోసం అంతా ఆతృతతో ఎదురుచూస్తున్నాం.. కానీ ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం మరిచిపోవద్దు. వైద్య సిబ్బంది కఠోర శ్రమవల్లే 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. 11 నెలలుగా దేశంలో వ్యాక్సినేషన్‌ ఉద్యమం కొనసాగుతోంది’’ అని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు.

 

బీజేపీకి మోదీ రూ.1000 విరాళం
భాజపా మద్దతుదారులు పార్టీ బలోపేతం కోసం మైక్రో డొనేషన్స్‌ అందించి సహాయపడాలని ప్రధాని మోదీ కోరారు. పార్టీ కోసం తాను రూ.1000 విరాళంగా ఇచ్చినట్లు, పార్టీ మద్దతుదారులంతా విరాళాలు ఇవ్వాలని కోరుతూ ప్రధాని ట్వీట్‌ చేశారు. ఎల్లప్పుడూ దేశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేదే భాజపా విధానమని, దేశ సంస్కృతిని కాపాడుతూ నిస్వార్థంగా జీవితాంతం సేవ చేయడమే భాజపా క్యాడర్‌ లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం మద్దతు దారులు ఇచ్చే మైక్రోడొనేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని తద్వారా భాజపా బలోపేతమవుతుందని ట్వీట్‌ చేశారు. డోనేషన్‌ ఇచ్చిన రసీదును ప్రధాని ట్వీట్‌కు జతచేశారు. ఇందులో మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నెంబర్‌, పాన్‌కార్డు నెంబర్‌ గోప్యత దృష్ట్యా చూపించలేదు. ఎందుకోసం డొనేషన్‌ ఇస్తున్నారు అన్న చోట పార్టీ ఫండ్‌ అని చూపించారు.విరాళం మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా కూడా రూ.1000 విరాళంగా ఇచ్చారు. నమో యాప్‌లో డొనేషన్‌ మాడ్యూల్‌ ద్వారా విరాళం ఇచ్చిన ఆయన భాజపాను బలోపేతం చేయడానికి తన సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ మద్దతుదారులతో పాటు, వారికి ప్రజా జీవితంలోని సన్నిహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులను కూడా రెఫరల్‌ కోడ్‌ ఉపయోగించి విరాళాలు అందించడంలో భాగస్వాముల్ని చేయాలని జేపీ నడ్డా ట్వీట్‌ చేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రారంభించిన మైక్రోడొనేషన్స్‌ స్వీకరణ దీనదయాళ్‌ జీ పుణ్యతిథి అయిన ఫిబ్రవరి 11, 2022వరకు కొనసాగుతుందని తెలిపారు.రూ.5నుంచి రూ.1000 వరకు విరాళాలుగా అందించవచ్చని నడ్డా ఒక ప్రకటనలో తెలిపారు.