బంగారం తరలింపులో..  ఎలాంటి అవకతవకలు జరగలేదు


– కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు
– టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌
తిరుమల, మే3(జ‌నంసాక్షి) : బంగారం తరలింపులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు..భక్తులు శ్రీవారికి సమర్పించే ప్రతి కానుకకు తమ వద్ద లెక్కలు ఉన్నాయని ఆయన తెలిపారు. వేసవి రద్దీ దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. మూడు నెలల పాటు వారాంతాల్లో బ్రేక్‌ దర్శనాన్ని ప్రోటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేశామని వెల్లడించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో పేర్కొన్నారు.
టీటీడీ ఆర్జిత సేవా టికెట్లు విడుదల..
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. ఆగస్టు నెలకు సంబంధించి 67,737 ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇందులో 11,412 సేవా టిక్కెట్లను ఆన్‌లైన్‌ డిప్‌ విధానానికి కేటాయించారు. సుప్రభాత సేవ 8,117, తోమాల సేవ 120, అర్చన 120, అష్టదళ పాదపద్మారాధన 180, నిజపాద దర్శనం 2,875 టిక్కెట్లు కేటాయించారు. సాధారణ పద్ధతిలో 56, 325 టిక్కెట్లను కేటాయించగా… అందులో విశేషపూజ 1,500, కల్యాణోత్సవం 13,300, ఊంజల్‌సేవ 4,200, వసంతోత్సవం 14,300, సహస్ర దీపాలంకార సేవ 15,600, ఆర్జిత
బ్ర¬్మత్సవం 7,425 టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. డిప్‌ పద్ధతిలో ఉన్న టిక్కెట్లకోసం నమోదుకు నాలుగు రోజుల పాటు అవకాశం కల్పించారు. నమోదు చేసుకున్న వారికి డిప్‌ విధానం ద్వారా ఆర్జిత సేవా టిక్కెట్లను కేటాయించనున్నారు.