బంగారం తరలింపు బాధ్యత పీఎన్‌బీదే

– వారు ఎలా తీసుకొస్తారనేది మాకు సంబంధంలేదు
– కేజీ బంగారం డిపాజిట్‌ చేయాలన్నా బోర్డునిర్ణయం తీసుకుంటాం
– ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌
తిరుమల, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : బంగారం తరలింపు బాధ్యత పీఎన్‌బీదేనని తితిది ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు. తమిళనాడులో భారీగా పట్టుబడ్డ బంగారంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. తిరపతికి ఈ బంగారాన్ని తరలిస్తున్న సమయంలో ఎన్నికల అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఆధారాలు చూపించడంతో ఆ బంగారాన్ని టీటీడీకి అప్పగించారు. ఈ సందర్బంగా బంగారం తరలింపు వివాదంపై టీటీడీ ఈవో సింఘాల్‌ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. టీటీడీకి రావాల్సిన బంగారం వచ్చినందున మరింత స్పష్టత ఇస్తున్నామని అన్నారు.  బంగారం తరలింపు విషయంలో పూర్తి బాధ్యత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌దేనని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అన్నారు. బంగారం ఎలా తరలిస్తారు? ఏ వాహనంలో తీసుకొస్తారు? వంటి వివరాలతో తమకు సంబంధం లేదని చెప్పారు. బంగారం తరలింపు వివాదంపై ఆయన సోమవారం విూడియాతో మాట్లాడారు. తితిదే బంగారం వచ్చినందున మరింత స్పష్టత ఇస్తున్నట్లు చెప్పారు. ‘గోల్డ్‌ డిపాజిట్‌ స్కీం 2000 ఏప్రిల్‌ 1న ప్రారంభమైందని, ఎస్‌బీఐలో 5,387 కిలోల బంగారం ఉందన్నారు. పీపీఎన్‌బీలో 1381 కిలోల బంగారం ఉందని, తితిదేకు సంబంధించి మొత్తం 9,259 కిలోల బంగారం ఉందన్నారు. 2016 ఏప్రిల్‌లో పీఎన్‌బీలో 1381 కిలోల బంగారం వేశామని తెలిపారు. అది 2019 ఏప్రిల్‌ 18కి మెచ్యురిటీ అయ్యిందన్నారు. మెచ్యురిటీ అంశంపై మార్చి 27నే పీఎన్‌బీకి లేఖ రాశామన్నారు. బంగారం తరలింపు అంశం పూర్తి బాధ్యత పీఎన్‌బీదేనని, పీఎన్‌బీ వచ్చి ట్రెజరీలో ఇస్తే అది తితిదే బంగారం అవుతుందని తెలిపారు. ఈసీ సీజ్‌ చేసేటప్పుడు డాక్యుమెంట్లు ఉన్నాయని పీఎన్‌బీ మాతో చెప్పిందని, ఈసీ అధికారులకు డాక్యుమెంట్లు చూపామని ఫోన్‌లో చెప్పారని అన్నారు. వాళ్లు ఈసీకి ఎలాంటి డాక్యుమెంట్లు చూపారో మాకు తెలియదని, మేం మార్చి 27న లేఖ రాసేటప్పుడు ఏప్రిల్‌ 18న రావాలని చెప్పామని తెలిపారు. ఏప్రిల్‌ 18కి బదులు ఏప్రిల్‌ 20న బంగారం అందజేశారన్నారు. బంగారం ఎలా తరలిస్తారో.. ఏ వాహనంలో తీసుకొస్తారో మనకెలా తెలుస్తుందని సింఘాల్‌ అన్నారు. బంగారం మాకు వచ్చేంత వరకు మిగిలిన విషయాలు అవసరం లేదన్నారు. బంగారం ఎలా వస్తే మాకేంటని ప్రశ్నించారు. మాకు బంగారం అందిందా లేదా అనేది ముఖ్యమని సింఘాల్‌ తెలిపారు. వడ్డీరేట్లు గోల్డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లో బాగా వస్తాయా లేదా అనేది బోర్డు నిర్ణయమన్నారు. కేజీ బంగారం డిపాజిట్‌ చేయాలన్నా బోర్డు నిర్ణయం తీసుకుంటామని, తితిదేకు ఏవిధంగా ఆదాయం ఎక్కువగా వస్తుందో వంటి నిర్ణయాలు బోర్డు పని అన్నారు. బంగారం విషయంలో తితిదే బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తామంటే ఎలాంటి అభ్యంతరం లేదని సింఘాల్‌ వివరించారు.