బంగారు తెలంగాణకు కాంగ్రెస్‌ అడ్డు

కరీంనగర్‌,జనవరి30(జ‌నంసాక్షి): సాధించుకున్న స్వరాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు అన్నారు. 14ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితమే తెలంగాణ అని అన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలు సాకారం అవుతున్నాయని, వీటిని చూసి తట్టుకోలేని కాంగ్రెస్‌ వారు విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీని ప్రజలు తిరస్కరించారని, పంచాయితీల్లో కూడా కాంగ్రెస్‌కు పరాభవం తప్పలేదన్నారు. నిజానికి బంగారు తెలంగాణకు మోకాలడ్డుతున్నది కాంగ్రెస్‌ వారేనని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 42 రోజుల సకల జనుల సమ్మెలో ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులు పాటు ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్‌ వ్యవస్థలో పనిచేస్తున్న అందరిని పర్మినెంట్‌ చేస్తామని హావిూ ఇచ్చిన ప్రకారమే సిఎం కెసిఆర్‌ నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్‌ వారు కోర్టుకెక్కిన విషయం మరువారదన్నారు. గిరిజనులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు చూస్తే గతంలో ఎప్పుడయినా ఇలా చేశారా అని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించుకోవాలన్నారు.