బంగారు తెలంగాణ దిశగా వడివడిగా అడుగులు
– మొత్తం రూ.1,30,415 కోట్లు
– ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్
నీటిపారుదల రంగానికి భారీగా కేటాయింపులు
సంక్షేమం,అభివృద్దికి ప్రధాన వాటా
పెరిగిన ప్రణాళికా వ్యయం
మొత్తం బడ్జెట్ వ్యయం రూ.1,30,415 కోట్లు
ప్రణాళికా వ్యయం రూ. 67,630 కోట్లు
ప్రణాళికేతర వ్యయం రూ.62,785 కోట్లు
రెవెన్యూ మిగులు రూ. 3,718 కోట్లు
ద్రవ్యలోటు రూ. 23,467 కోట్లు
ఈ ఏడాది ఆదాయం అంచనా రూ. 72,412 కోట్లు
సాగునీటి రంగానికి రూ. 25 వేల కోట్లు
కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.6,286 కోట్లు
పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు రూ. 7,861 కోట్లు
సీతారామ ఎత్తిపోతలకు రూ.1,152 కోట్లు
మిషన్ భగీరథకు రూ. 36,976 వేల కోట్లు
వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖకు రూ. 6,759 కోట్లు
రుణమాఫీకి రూ.3,718 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ. 5967 కోట్లు
హైదరాబాద్,మార్చి14(జనంసాక్షి):సంక్షేమ రంగంతో పాటు అభివృద్దికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ, ప్రణాళికా వ్యయాన్నిపెంచుతూ తెలంగాణ శాసనసభలో 2016-17 రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ప్రకటింఇచన వివిధ పథకాలు, ప్రాజెక్టులు, సంక్షేమరంగాన్ని దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించారు. ఏ రంగాన్ని విస్మరించకుండా నిధులు కేటాయించడం విశేషం.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూ.1,30,415 కోట్లతో బడ్జెట్ రూపొందించామని ఈటల వెల్లడించారు. ప్రణాళికా వ్యయం రూ.67,630 కోట్లు, ప్రణాళికేతర వ్యయం 62,785.14 కోట్లుగా నిర్ణయించినట్లు చెప్పారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ ఉంటుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మూడోసారి తాను ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నానని ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రంపై దశాబ్దాలపాటు వివక్ష కొనసాగిందని, ఇప్పుడు కూడా కేంద్రం నుంచి రూ.450కోట్లు మాత్రమే సాయం అందిందని తెలిపారు. ఉమ్మడి బకాయిలను కూడా తాము చెల్లించాల్సి వస్తోందని వివరించారు. ఈ బడ్జెట్ రాష్ట్రంలో సమూల మార్పులకు నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో తెలంగాణలో నీటిపారుదల రంగానికి రూ.25వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. వాగ్దానాల దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ తెచ్చామన్నారు. సీఎం ప్రతీశాఖ పనితీరును సవిూక్షించారని వెల్లడించారు. బంగారు తెలంగాణ నినాదం కాదని, మహాసంకల్పం అని ఆయన స్పష్టం చేశారు. గతంలో రెండుసార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని ప్రజాసంక్షేమం, వాస్తవికత ప్రధాన ఎజెండాగా బడ్జెట్ను రూపొందించామని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నో ఆశలతో ప్రత్యేక రాష్టాన్న్రి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించామని ఆయన చెప్పారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధనే ఎజెండాగా ప్రభుత్వం అసెంబ్లీలో మూడో వార్షిక బడ్జెట్‌ను ప్రకటించారు. రెండేళ్లపాటు భారీ అంచనాలతో బడ్జెట్‌ను ప్రకటించిన ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్ రూ.1,30,415 కోట్లుగా ప్రకటించింది. గతేడాదితో రూ.1,15,689 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఈ ఏడాది రూ.14,726 కోట్లు బడ్జెట్ పద్దు పెరిగింది. రెవెన్యూ మిగులు రూ.3,318 కోట్లు కాగా, ద్రవ్య లోటు అంచనా రూ.23,467.29 కోట్లని ఈటల పేర్కొన్నారు. ప్రధానంగా నీటిపారుదల రంగానికి భారీగా నిధులు పెంచారు. భారీగా ప్రాజెక్టులు చేపడుతున్న దశలో ఈ రంగానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిషన్ భగీరథకు రూ.36,976కోట్లు, నీటిపారుదల రంగానికి రూ.25వేల కోట్లు, కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.6286 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు రూ.1,150కోట్లు. పాలమూరు ఎత్తిపోతలకు రూ.7,861కోట్లు కేటాయించి నీటిపారుదల రంగానికి పెద్దపీట వేశారు. గోదావరి, కృష్ణానదుల్లో రాష్ట్ర వాటా 1250 టీఎంసీలు కాగా, మేడిగడ్డ ప్రాణహిత, పెన్‌పహాడ్, తుమ్మిడిహట్టి ప్రాజెక్టుల నిర్మాణం, గోదావరి, కృష్ణా నదులపై కర్ణాటక, మహారాష్ట్ర 450 బ్యారేజీలు నిర్మించాలన్న సంకల్పాన్ని ప్రకటించారు. ప్రాణహిత, ఇంద్రావతి నీళ్లు ఒడిసిపట్టి పంట పొలాలకు నీళ్లు పారిస్తామన్నారు. గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగాపై నిర్మించే బ్యారేజీలకు మహారాష్ట్ర సహకారం తీసుకున్నామని చెప్పారు. నదీజలాల సమస్యల పరిష్కారానికి ఉమ్మడి అంతర్‌రాష్ట్ర బోర్డు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. రైతు రుణమాఫీకి ప్రభుత్వం రూ.4250 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కొత్త రాష్ట్ర సమస్యలు, అధికారుల కేటాయింపులో జాప్యం జరిగిందని విమర్శించారు. అంచనాల మేరకు కేంద్రం నుంచి నిదులు అందకపోవడంతో బడ్జెట్ అంచనాలను తగినంతగా ఖర్చుచేయలేకపోయామని తెలిపారు. కోర్టు కేసుల కారణంగా భూమల అమ్మకం జరగలేదన్నారు. వాణజ్యపన్నుల బకాయిల్లో కేసుల కారణంగా వసూలుకాలేదని మంత్రి ఈటెల వివరించారు. ఉమ్మడి రాష్ట్రం నాటి సమస్యలను తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కోవలసి వస్తోందని ఈటెల రాజేందర్ అన్నారు.అప్పట్లో పెండింగులో ఉన్న బిల్లులను కూడా తెలంగాణ ప్రభుత్వం చెల్లించవలసి వస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర వృద్ది రేటు 11.8 శాతంగా ఉందని ఆయన చెప్పారు. వచ్చే సంవత్సరం వర్షాలు బాగుంటాయని ఆశిస్తున్నామని అన్నారు. తెలంగాణ లో తలసరి ఆదాయం కూడా పెరిగిందని ఆయన చెప్పారు.ఇక్కడ వనరులను ఇతర ప్రాంతాలకు తరలించే వారని, తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆ సమస్య పోయిందని అన్నారు. వ్యవసాయం, సేవలు,పారిశ్రామిక రంగాలలో ప్రగతి సాదించడానికి అవకాశం ఏర్పడిందని ఈటెల చెప్పారు. బంగారు తెలంగాణ కలను సాధ్యం చేసేందుకు అన్ని వనరులను ఉపయోగిస్తున్నామని ఆయన తెలిపారు. వాగ్దానం చేయడం ,పథకాలను రూపొందించడమే కాదని, వాటిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి తెలిపారు.ఇకపోతే ఇచ్చిన హావిూ మేరకు రాష్ట్రంలో అర్హులైన పేదలకు దశల వారీగా డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఇస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి విషయం తెలిసిందే. రెండు పడక గదులు, హాలు, వంటగది, రెండు మరుగుదొడ్లు ఉండేలా ఇండ్లు కట్టించి ఇస్తామని ఉద్ఘాటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. గతేడాది 60 వేల ఇండ్లను మంజూరు చేశామని గుర్తు చేశారు. ఇందులో 36 వేల ఇండ్లు
గ్రామాల్లో, 24 వేల ఇండ్లు పట్టణ ప్రాంతాల్లో నిర్మించాలన్నది లక్ష్యమని స్పష్టం చేశారు. 2016-17 సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక లక్ష ఇండ్లు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మరో లక్ష ఇండ్లు నిర్మించాలని భావిస్తున్నామని చెప్పారు. ఈ రెండు లక్షల ఇండ్ల వ్యయాన్ని హడ్కో నుంచి ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ఎటువంటి రాజకీయ అధికారిక ఒత్తిడులకు తలగ్గొకుండా, లబ్ధిదారులకు నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తామని తెలిపారు. సంక్షేమానికి కేటాయింపులు పరిశీలిస్తే బీసీ సంక్షేమానికి రూ.2,538 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.1,204 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.7,122 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.3,752 కోట్లు, ఆసరా పింఛన్ల కోసం రూ.4,693 కోట్లు, కల్యాణ లక్ష్మి పథకానికి రూ.738 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.100 కోట్లు, మహిళ శిశు సంక్షేమానికి రూ.1,553 కోట్లు, రుణమాఫీ కేటాయింపులు రూ.3,718 కోట్లు ప్రకటించారు. ఇకపోతే రహదారులు, భవనాలకు రూ.3,333 కోట్లు, పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధికి రూ.10,731 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.4,815 కోట్లు, పారిశ్రామికాభివృద్ధికి రూ.967 కోట్లు, ప్రత్యేక అభివృద్ధి కోసం రూ.4,675 కోట్లు, అగ్నిమాపక శాఖకు రూ.223 కోట్లు, ఐటీ, సమాచార శాఖకు రూ.254 కోట్లు, సంస్కృతి, పర్యాటకానికి రూ.50కోట్లు కేటాయించారు. ఇక విద్యారంగానికి కూడా పెద్ద ఎత్తున నిధులు ప్రకటించారు. విద్యాశాఖలో ప్రణాళికేతర వ్యయం రూ.9,044 కోట్లు కాగా, ప్రణాళిక వ్యయం రూ.1,164 కోట్లుగా చూపాలరు. ఆరోగ్యశాఖకు రూ.5,967 కోట్లు కేటాయించి ప్రభుత్వం ప్రకటించిన విధంగా పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టతకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 చోట్ల డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు చేస్తామన్నారు. స్తూల ఉత్పత్తి పెరుగుదలే అభివృద్ధి కాదు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధించగలమన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరిస్తామన్నారు. వ్యవసాయశాఖకు రూ.6,759 కోట్లు కేటాయించడంతో పాటు రెండు విడతల రుణమాఫీ సొమ్ము బ్యాంకుల్లో జమచేశామన్నారు. పండ్లు, కూరగాయల సాగుకు హార్టికల్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్య పరిశ్రమకు ప్రోత్సాహం ఇస్తున్టన్లు వెల్లడించారు. నీళ్లు, నిధులు, నియామకాలు మన ఆధీనంలోకి వచ్చాయి. రాబోయే మూడేళ్లలో 23,912 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం అని ప్రకటించారు. వచ్చే ఖరీఫ్ నుంచి వ్యవసాయానికి 9గంటల విద్యుత్ ఇస్తామని హావిూ ఇచ్చారు. రాష్టాన్న్రి విత్తన భాండాగారంగా ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 21 నెలల్లోనే బంగారు తెలంగాణకు బాటలు వేశామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మిషన్ భగీరథ పథకం సృష్టికర్త సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచులు మంచినీటి కోసం రోడ్లపై నిలుచోకూడదనే సదుద్దేశ్యంతో ఇంటింటికి మంచినీటిని అందించేందుకు ఈ పథకం చేపట్టారని వివరించారు.




