బంగారు తెలంగాణ పేరుతో ప్రజా వంచన
ఉమ్మడి పోరాటాల ద్వారానే ఎదుర్కోవాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
హైదరాబాద్,ఆగస్ట్1(జనంసాక్షి): బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేయడంతో పాటు బడుగు బలహీనవర్గాల వారిపై దాడులు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.నాలుగేళ్లయినా తెలంగాణ బతుకులు బాగు పడలేదని, సమస్యల సాధనకు ఇక ఉమ్మడి పోరాటాలే శరణ్యమని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, ఇందుకు నేరెళ్ల ఘటననే నిదర్శనమని అన్నారు. దళితులపై దాష్టీకం కనబర్చినా సిఎం కెసిఆర్ ఎందుకు స్పందించలేదన్నారు. దేశంలో మతోన్మాద శక్తుల వల్ల ప్రజాస్వామ్యం, లౌకికవాదా నికి ప్రమాదం ఏర్పడిందని, వీటిని పరిరక్షించడానికి ఉధృతంగా పోరాటాలు చేయనున్నామని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఇతర మతతత్వ శక్తుల దుష్టపన్నాగాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. భూ కుంభకోణాలు, కల్తీవ్యాపారం, ఇసుక మాఫియా, డ్రగ్స్ మాఫియాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చాడ విమర్శించారు. కాషాయీకరణ ముసుగులో ఆర్థిక, భూ, డ్రగ్స్ మాఫియా తయారైందని అన్నారు. ఈ మాఫియాకు గుజరాత్ కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. బిజెపి పాలనలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్య రక్షణకు యువత మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఇటువంటి విధానాలను వ్యతిరేకించాల్సిన రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కేంద్రం వద్ద మోకరిల్లుతున్నారని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరమైందని చెప్పారు. తెలంగాణ వచ్చిన తరవాత కూడా అభివృద్ది కోసం పోరాడాల్సి ఉంటుందని అనుకోలేదని అన్నారు. తెలంగాణలో అభివృద్దికి సంబంధించి ఓ ప్రాతిపదిక లేకుండా పోయిందన్నారు. అభివృద్ధిలో రాష్ట్రం నంబర్ వన్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నా ప్రజాభివృద్ధి మాత్రం జీరోలో ఉన్న విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అభివృద్ధిలో నంబర్ వన్ అయితే ప్రజల సమస్యలు ఎందుకు పరిష్కారం కావని ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరగాలనే లక్ష్యంతోనే పోరాటం చేస్తున్నామన్నారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సొంత రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు ప్రజలకు దక్కుతాయని ఆశిస్తే పరిస్థితి భిన్నంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సమగ్ర
వ్యవసాయ విధానం లేదని, చిన్న పరిశ్రమలను బతికించే విధానం రాలేదని వాపోయారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామంటూ ప్రకటనలు గుప్పించిన ప్రభుత్వం.. పంపిణీ చేసిన భూమి కంటే గుంజుకున్నదే ఎన్నో రెట్లు ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్‌లోనే ఎన్నో సమస్యలు తిష్ట వేశాయన్నారు. కొండపోచమ్మసాగర్ నిర్మాణంలో పెద్దోళ్ల భూములొదిలేసి పేదోళ్ల భూములనే లాక్కుంటున్నారని ఆరోపించారు. భయపడి భూములు ఇస్తున్నామని రైతులు అంటున్నారని అన్నారు.