బంగారు తెలంగాణ పేరుతో మోసం: సిపిఎం
నిజామాబాద్,జూన్2(జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణ అవుతుందన్నారు, కాని ఇచ్చిన హావిూలు మాత్రం నెరవేర్చడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి గంగాధరప్ప అన్నారు. హావిూలు మాటలకే పరిమితమవుతున్నాయని అన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అభివృద్ధి చెందాలన్నారు. సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ది కోసం సిపిఎం పోరాడుతోందని అన్నారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ, డబుల్ బెడ్‌రూం, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తదితర పథకాల అమలు జరగడం లేదన్నారు.ప్రభుత్వం భారీఎత్తున చేస్తున్న పనుల మాటున జరుగుతున్న అవినీతిని ప్రజలు గ్రహించాలని సీపీఎం నేత అన్నారు. బంగారు తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలు పెరగడమేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్‌భగీరథ పథకాల పేరిట అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు నెరవేర్చడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా నిధులన్నీ వృథా చేస్తోందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని.. పెళ్లయిన సంవత్సరం వరకు కూడా లబ్ధిదారులకు డబ్బులు రావడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేపట్టడానికి సిపిఎం ముందుంటుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నగదు రహిత రాష్ట్రాన్ని తయారు చేస్తానని చెబుతున్నారని, రాష్ట్రంలో 70 శాతం మందికి బ్యాంకు ఖాతాల్లేవని, ఉన్న వారికి కనీస అక్షరాస్యత కూడా లేదని, అలాంటప్పుడు అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.