బంగారు తెలంగాణ లక్ష్యంగా కార్యక్రమాలు
ఆదిలాబాద్,జూలై30(జనం సాక్షి): బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణ బద్దులయ్యారని ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఎమ్మెల్యే రేఖానాయక్ పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ హాయాంలో జరుగుతున్న అభివృద్ధికి పలువురు ఆకర్షితులై పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారన్నారు. నియోజకవర్గ మైనార్టీలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో నిరుపేదలకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో గురుకుల పాఠశాలలను మంజూరు చేశారని వివరించారు. రైతాంగానికి సాగునీరు అందించాలని కృతనిశ్చయంతో అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని పెన్‌గంగాపై బ్యారేజీ నిర్మాణం పనులను చేపట్టామని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, నిరుపేద విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోఎన్నడు లేని అభివృద్ధి టీఆర్‌ఎస్ హాయంలో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.