బంగాల్‌లో కొనసాగుతున్న పోలింగ్‌

కోల్‌కతా! పశ్చిమ్‌బంగలో కీలకమైన మూడో దశ ఎన్నికల పోలింగ్‌ ప్రశాతంగా కొనసాగుతోంది. ముర్షీదాబాద్‌, నదియా, వర్థమాన్‌; ఉత్తర్‌ కోల్‌కతాలోని 62 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 9 గంటల వరకు 18.29 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది.

ఈ ఎన్నికల్లో 418 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో 34 మంది మహిళలు కూడా ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ జరగనుంది. వామపక్షాలు-కాంగ్రెస్‌ సంకీర్ణం, తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. వీరి భవిష్యత్తుని నిర్ణయించేందుకు 1.37కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

పటిష్ఠ బందోబస్తు..
ఈసారి ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు తీసుకుంది.ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కేంద్ర సాయుధ దళాలకు చెందిన 75వేల మందిని మోహరించింది. మరో 25వేల మంది రాష్ట్ర పోలీసు సిబ్బంది సైతం విధులు నిర్వహిస్తున్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలకూ కేంద్ర బలగాలే భద్రత కల్పిస్తున్నాయి.