బంగాళాఖాతంలో వాయుగుండం

1విశాఖపట్టణం : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారుతోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ వాయుగుండం మరింత బలపడుతోంది. పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ, తీవ్ర వాయుగుండంగా, ఆ తరువాత తుపానుగా మారనుంది. ఈ తుపానుకు రోవానుగా నామకరణం చేస్తూ ఐఎండీ అధికారికంగా ప్రకటించనుంది.

బంగాళాఖాతంలో వాయుగుండం

రోవాను తుపాను సోమవారం అర్ధరాత్రికి కరైకల్, చెన్నైల మధ్య పుదుచ్చేరికి సమీపంలో తీరాన్ని దాటే అవకాశముందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ తుపాను తమిళనాడువైపుగా పయనిస్తోంది. దాని ప్రభావం తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలపై కూడా ఉండనుంది. రానున్న మూడురోజుల పాటు కోస్తాంధ్రలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రమాద హెచ్చరికలు..
తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో ఒకటో నంబర్‌ ప్రమాద సూచికను ఎగురవేశారు.