బంగాళాదుంపల మధ్య గంజాయి తరలింపు

50 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
విశాఖపట్టణం,జులై24(జ‌నంసాక్షి): విశాఖపట్టణంలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని గంగరాజు మాడ్గుల ప్రాంతంలో పోలీసులు, ఎక్సైజ్‌ పోలీసులు కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఓ జీపులో తరలిస్తున్న 500 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీలేరు నుంచి బంగాళాదుంపల మధ్యలో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గంజాయిని తరలిస్తున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్‌ చేశారు. ఈ గంజాయి విలువ రూ. 50 లక్షల విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. అనకాపల్లి రేంజ్‌ పరిధిలో గడిచిన 10 నుంచి 12 రోజుల్లో గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తున్న 12 వాహనాలను సీజ్‌ చేశామని పోలీసులు పేర్కొన్నారు. గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ప్రధాన స్మగ్లరైన ముగ్గురి కోసం గాలిస్తున్నామని ఎక్సైజ్‌ పోలీసులు చెప్పారు. జులై 21వ తేదీన ఓ వ్యక్తి నుంచి రూ. 25 లక్షల విలువ చేసే 195 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. జులై 12వ తేదీన విశాఖపట్టణం రూరల్‌లోని నీలంపేట జంక్షన్‌ వద్ద రెండు వాహనాల్లో తరలిస్తున్న 1400 కిలోల గంజాయిని సీజ్‌ చేశామని తెలిపారు.