బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లు

` 72 మంది మృతి
` దేశవ్యాప్తంగా కర్ఫ్యూ
ఢాకా(జనంసాక్షి):రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో పొరుగు దేశం బంగ్లాదేశ్‌ మరోసారి భగ్గుమంది. దేశ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలతో వణికిపోయింది. అధికార పార్టీ మద్దతుదారులు, ఆందోళనకారులకు మధ్య ఆదివారం చోటుచేసుకున్న ఘర్షణల్లో 72 మంది ప్రాణాలు కోల్పోయారు.వీరిలో 14 మంది భద్రతా సిబ్బంది ఉండగా.. సిరాజ్‌గంజ్‌లోని ఓ పోలీస్‌ స్టేషన్‌పై జరిపిన దాడిలోనే 13 మంది పోలీసులు మృతిచెందారు. వందలాది మంది తీవ్ర గాయాలపాలైనట్లు స్థానిక విూడియా వెల్లడిరచింది. కేవలం రాజధాని ఢాకాలోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.మరోసారి ఘర్షణలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి నిరవధిక కర్ఫ్యూ విధించింది. ఫేస్‌బుక్‌, మెసెంజర్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌విూడియా వేదికలపైనా ఆంక్షలు విధించింది. 4జీ సేవలు నిలిపివేయాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. మరోవైపు నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడే వారు విద్యార్థులు కాదు.. ఉగ్రవాదులని ప్రధానమంత్రి షేక్‌ హసీనా పేర్కొన్నారు. అటువంటి వారిని అణచివేయాలని పౌరులకు పిలుపునిచ్చారు.