బంగ్లాదేశ్‌ దుస్తుల కర్మాగారంలో అగ్నిప్రమాదం

8 మంది మృతి

ఢాకా : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని ఒక దుస్తుల కర్మాగారంలో నిన్న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆ సంస్థ ఎండీతో సహా ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల్లో పోలీసు ఉన్నతాధికారి కూడా ఉన్నారు. రాత్రి సమయం కావడంతో సిబ్బంది ఎవరూ లోపల లేరు. స్వెటర్లు తయారుచేసే కర్మాగారం, ఎండీ కార్యాలయం, నివాస సముదాయం అన్నీ 11 అంతస్థుల ఒకే భవనంలో ఉన్నాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా ప్రమాదం చోటుచేసుకుందని భావిస్తున్నారు. అన్ని అంతస్థుల నుంచి ఒకేసారి అగ్నికీలలు ఎగసిపడ్డాయి. కర్మాగారం మేనేజింగ్‌ డైరెక్టర్‌ తన స్నేహితులైన పోలీసు అధికారి, మరి కొందరితో తన కార్యాలయంలో సమావేశమై ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో వారెవరూ తప్పించుకుని బయటపడలేకపోయారని అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదాల నేపథ్యంలో ఇప్పటికే ఆ దేశం 18 దుస్తుల కర్మాగారాలను మూసివేసింది. భద్రతకు సంబంధించిన అంశాలు విదేశి కొనుగోలుదారులకు ఇబ్బంది కలిగించకూడదనే ఈ చర్య చేపట్టింది. ఇక ముందు భవనాల భద్రత విషయంలో మరింత కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.