బడికోసం బస్సుయాత్రకు అడ్డంకులు

మానాపురం వద్ద అడ్డుకున్న పోలీసులు
తల్లిదండ్రులు వినతి ఇవ్వకుండా ఆంక్షలు
పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్సీలు

విజయనగరం,జూలై26(జనంసాక్షి): ప్రాథమిక పాఠశాలల విలీనాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు చేపట్టిన బడికోసం బస్సు యాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. మంగళవారం ఉదయం పార్వతీపురం నుంచి బయలుదేరిన బస్సుయాత్ర ఉదయం 10 గంటలకు గజపతినగరం మండలం మానాపురం వద్దకు చేరుకుంది. అక్కడ ఎమ్మెల్సీలు అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా మరుపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు వినతులు ఇచ్చేందుకురాగా వినతులు స్వీకరించేందుకు అనుమతి లేదంటూ పోలీసులు వారికి అడ్డు చెప్పారు దీంతో ఎమ్మెల్సీలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పాఠశాల మా ఊరిలోనే ఉండాలి అని తల్లిదండ్రుల ఇస్తున్న విజ్ఞాపన పత్రాన్ని సైతం తీసుకోవడానికి బస్సు దిగివద్దని ఎమ్మెల్సీల విూద పోలీసుల ఆంక్షలు పెట్టడం పట్ల పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాథమిక పాఠశాల నుంచి మూడు, నాలుగు, ఐదు తరగతి విద్యార్థులను సౌకర్యాలు లేని ఉన్నత పాఠశాలకు తరలిస్తున్నారని , దీని అడ్డుకోవడం కోసం తల్లిదండ్రులందరు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే పలు ఆందోళనలు చేశామని, సిపిఎం నేతల ద్వారా ప్రభుత్వానికి తమ ఆందోళన తెలియపరుస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ’ మా ఊరి బడి మా ఊర్లోనే ఉండాలి ’ అని ఈ సందర్భంగా ఎమ్మెల్సీలకు తల్లిదండ్రులు
విజ్ఞాపన పత్రం ఇచ్చారు. ఇలా విజ్ఞాపన పత్రాలను తీసుకోకూడదని పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ వారితో వాగ్వాదానికి దిగి తల్లిదండ్రుల విజ్ఞాపన పత్రాన్ని నేతలు స్వీకరించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలా ఆంక్షలు విధించడం సరైన చర్య కాదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల విలీనాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు విఠపు.బాలసుబ్రమణ్యం, కేఎస్‌.లక్ష్మణరావు, వై.శ్రీనివాసులరెడ్డి, ఐ.వెంకటేశ్వరరావు, షేక్‌ సాబ్జి, యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ఎ.కృష్ణసుందర రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయ గౌరీ, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.మురళీధర్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కే.ప్రసన్నకుమార్‌, యూటీఫ్‌ విజయనగరం జిల్లా కోశాధికారి చింతా భాస్కరరావు, యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ కే.అప్పారావు, దత్తిరాజేరు మండల అధ్యక్షులు ఎన్‌.చంద్రరావు, మండల కార్యవర్గ సభ్యులు సిహెచ్వి.సత్యనారాయణ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌, సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.