బడుగుల అభ్యున్నతి కోసమే పార్టీ వీడా
– బంగారు తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌లో చేరా
– బాధతో కాంగ్రెస్‌ను వీడుతున్నా : డీఎస్
హైదారబాద్,జులై2(జనంసాక్షి):
ప్రత్యేక తెలంగాణ సాధించడంలో కీలక భూమిక పోషించిన తాను, బంగారు తెలంగాణ సాధించాలనుకుంటున్న సిఎం కెసిఆర్‌తో కలసి పనిచేయాలనుకుంటున్నానని పిసిసి మాజీ చీఫ్, కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ అన్నారు. అందుకే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. బంగారు తెలంగాణలో బిసిలు ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరగాలన్నదే తన ఆశయమన్నారు. తన అంతరాత్మ ప్రబోధం మేరకే టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు డీఎస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడుతూ ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత సోనియాగాందీకి పంపినట్లు చెప్పారు. నిజానికి కాంగ్రెస్‌ను వీడుతున్న ఈ రోజు తనకు బాధాకరమైనా ఓ లక్ష్యసాధన కోసం తప్పడం లేదన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. తన జీవితంలో బాధకరమైన రోజని అన్నారు. 1969లో గాంధీభవన్‌లో అడుగుపెట్టిన తాను రెండు ఎలక్షనల్లో 294 బి ఫారాలు ఇచ్చానన్నారు. కాంగ్రెస్‌లో తనపట్ట సోనియా చూపించిన అభిమానం, విశ్వాసాన్ని ఎప్పటికీ మరువనని అన్నారు. అదే సందర్భంలో ఆయన రాషట్‌ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో సిస్టమ్ మారిందని అందువల్ల కూడా ఇక పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తనకు ఎమ్మెల్సీ రాలేదనో లేదా పదవుల కోసమో తాను పార్టీ మారడం లేదన్నారు. తనను కాంగ్రెస్‌లో ఏనాడు సోనియా తక్కువ చేసి చూడలేదన్నారు. అయితే కొందరు మధ్యవర్తుల వల్ల పార్టీలో పనితీరు మారిందన్నారు. పార్టీలో తాను ఎంత హ్యూమిలేషన్ అనుభవించినా ఏనాడు బయటకు చెప్పలేదని, ఇకముందు కాంగ్రెస్ వ్యవహారాలపైనా కామెంట్ చేయనని అన్నారు. తెలంగాణ సాధనకోసం తనవంతుగా చాలా ప్రయత్నం చేశానని, అయితే తెలంగౄణ తెచ్చిన క్రెడిట్ కెసిఆర్‌కే దక్కుతుందని అన్నారు. పద్ధతిగా పార్టీ వీడుతున్నా. కాంట్రవర్సీ కామెంట్స్ చేయను. కొన్ని పరిస్థితుల వల్ల పార్టీ వీడాల్సి వస్తోంది. నా అంతరాత్మ ప్రబోధం మేరకే పార్టీ వీడుతున్నానని డిఎస్ పేర్కొన్నారు.
తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్‌దే
పదవుల కోసం పార్టీని వీడుతున్నానని కొందరు అజ్ఞానులు ఆరోపణలు చేస్తున్నారని, తనకు పదవులు ఓ లెక్క కాదన్నారు. ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప తాను నిర్వర్తించని బాధ్యతలు ఏవీలేవన్నారు. అలాగే ఎమ్మెల్సీ పదవి నాకు ఓ లెక్క కాదన్నారు. మంత్రి పదవి ఇచ్చినా నాకవసరం లేదు. తెలంగాణ సాధనలో నా వంతు పాత్ర పోషించాను. తెలంగాణ తెచ్చిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్‌దే. కేసీఆర్ ఎంతో కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నరు. కెసిఆర్ నాయకత్వ పటిమ వల్ల తెలంగాణ సాధ్యమైందని ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ అబివృద్ది ముఖ్యమని అన్నారు. బంగారు తెలంగాణ కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని వివరించారు. అంతేగాకుండా హైదారాబాద్‌తో పాటు తెలంగాణలో ఉంటున్న సీమాంధ్ర వారికి అండగా ఉంటానన్నారు. వారికి భరోసా కల్పిస్తానని అన్నారు. రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలొస్తాయని తెలంగాణ బిడ్డలు భావించారు. ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం జరుగుతోంది. పార్టీలకతీతంగా ప్రభుత్వానికి నేతలు సహకరించాలి. బంగారు తెలంగాణలో తనవంతు పాత్ర పోషిస్తాని, ఈ వయసులో రాజకీయాలు చేయడం నాకిష్టం లేదన్నారు. ప్రభుత్వానికి సహకరించాల్సిన పార్టీలు పాలిటిక్స్ చేస్తున్నాయి. ఏపీ సర్కార్ రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటోంది. అన్ని పార్టీలు రాజీకాయాలకు అతీతంగా వ్వయహరించి తెలంగాణ అభివీదద్‌ఇకి కృషి చేయాల్సి ఉందన్నారు. టీఆర్‌ఎస్‌లోకి తాను మాత్రమే వెళ్తున్నానని, ఎవరొస్తారో తెలీయదని ఆయన పేర్కొన్నారు. అయితే పార్టీలో ఉన్నంత కాలం కాంగ్రెస్‌లో నిబద్ధతతో పనిచేశానని డి. శ్రీనివాస్ అన్నారు. పార్టీ ఎన్నో పదవులు ఇచ్చిందని తానూ అలాగే పనిచేశానని పేర్కొన్నారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని ప్రజలందరికీ తెలుసని, రాష్ట్ర సాధనలో ఎక్కువ కృషి కచ్చితంగా కేసీఆర్‌దేనని ఆయన చెప్పారు. సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి పథాన సాగాలన్నారు.
దిగ్విజయ్ మోసకారి
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ని మోసకారిగా డీఎస్ అభివర్ణించారు. తాను శాసనమండలి సభ్యత్వం ఇవ్వలేదని పార్టీ వీడడం లేదని , ఇప్పుడు టిఆర్‌ఎస్ లో కూడా ఎలాంటి పదవి ఆశించడం లేదని పిసిసి మాజీ అద్యక్షుడు డి.శ్రీనివాస్ చెప్పారు. ఎఐసిసి ప్రదాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ దిగజారి మాట్లాడారని అన్నారు. తాను వందల మందికి పార్టీ టిక్కెట్లు ఇచ్చానని, అలాంటిది ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీ మారుతున్నానని అనడం తప్పు అని ఆయన అన్నారు.దిగ్విజయ్ తనను రాజకీయ అవకాశ వాది అనడంపై స్పందిస్తూ ఆయన పెద్ద బ్లఫర్ అని శ్రీనివాస్ ద్వజమెత్తారు.దిగ్విజయ్ సింగ్ చెప్పుడు మాటలు వినేరకం అని ఆయన అన్నారు. ఆకుల లలితకు తాను మద్దతు ఇచ్చానని, అయితే కనీసం తనకు దిగ్విజయ్ సింగ్ కనీసం సమాచారం ఇవ్వలేదని ఆయన అన్నారు.రాజకీయంగా తాను సంతృప్తి చెందిన వ్యక్తి అని , ఇప్పుడు తెలంగాణ అబివృద్దిలో భాగస్వామి అవ్వాలన్నదే తన ఉద్దేశం అని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.కెసిఆర్ తో చర్చలు జరిపిన సందర్భంలో కూడా అదే విషయాన్ని చెప్పానని అన్నారు. ముఖ్యమంత్రి పదవి తప్ప కాంగ్రెస్ తనకు చాలా గౌరవమిచ్చిందని, తను కూడా అలాగే పనిచేశానని, అదే సమయంలో అవమానాలు భరించానని శ్రీనివాస్ తెలిపారు.సోనియాగాంధీ ఎప్పుడూ గౌరవించారని,కాని పలుమార్లు పార్టీలో అవమానాలు వచ్చాయని అన్నారు.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినా తాను ఎన్నడూ బయటపడలేదని అన్నారు.