బతుకమ్మలకు పూల కళ
వర్షాలతో విరివిగా లభ్యం అవుతున్న తంగేడు
హైదరాబాద్,సెప్టెంబర్30 (జనంసాక్షి): ఈ సారి బాగా వర్షాలు పడడంతో తెలంగాణ వ్యాప్తంగా చెరువులు
నిండిబతుకమ్మలు వేయడానికి అనువుగా మారింది. దీనికితోడు అడవిలో దొరికే పూలకు ఢోకా లేకుండా పోయింది. స్థానికంగా లభించే తంగేడు, గునుగు,గడ్డి పూలు విరనగ పూసాయి. హైదరాబదాద్ లాంటి నగరాల్లో ఉదయం నుంచే పూల అమ్మకాలు చేపట్టారు. కొంచెం ఖరీదయినా అన్ని రకాల పూలను అమ్మకాలు పెట్టారు. దీంతో బతుకమ్మకు పూల బాధ లేకుండా పోయిందని మహిళలు వ్యాఖ్యానించారు. పూర్తిగా ప్రకృతిని ఆరాధిస్తూ సంప్రదాయబద్ధంగా జరుపుకొనే అతిపెద్ద పండగ ఇది.. ఎందుకంటే ఏ పండగైనా మూడు, నాలుగు రోజులకు మించి జరగవు.. కానీ ఈ పండగను తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన పండగ తెలంగాణాలోనే కాకుండా దేశ విదేశాల్లోనూ
ఘనంగా జరుపుకొంటున్నారు. ఇదే సమయంలో పాఠశాలలకు సెలవులు ఉండటంతో పిల్లల నుంచి పెద్దల వరకు సందడి నెలకొంటుంది.తమకు తోచిన విధంగా చిన్న, పెద్ద బతుకమ్మలను తయారు చేసేందుకు పూలను కొనుగోలు చేసారు. మరోవైపు అన్ని డివిజన్లలో ఆటపాటలతో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆశ్వయుజ మాసంలో తెలంగాణలో ఈ పండగను నిర్వహిస్తారు. బతుకమ్మలతో చెరవు గట్లకు చేరుకొని అమ్మవారి మహిమలను కీర్తిస్తూ పాటలు పాడుతూ.. ఆనందంగా గడుపుతారు. తెలంగాణ పండగగా గుర్తింపు పొందిన బతుకమ్మకు ఎంతో ప్రాముఖ్యముంది. ఈ నేపథ్యంలో ఇప్పుడే గ్రామాల్లో పండగ సందడి మొదలైంది. తెలంగాణ మహిళల సంప్రదాయాల సిరిగా పేరొందిన బతుకమ్మ శుక్రవారం సందడిగా ప్రారంభం అయ్యింది. . బతుకమ్మ అంటేనే గుర్తుకు వచ్చేది పూల సందడి.. వివిధ రకాల పూలను ఏడు దశల్లో అలంకరించి పూజించడం ఆనవాయితీ.. పూలను గౌరీదేవి ప్రతిరూపంగా కొలుస్తూ మహిళలు పాటలు పాడుతారు. బతుకమ్మను అమ్మగా కొలవడం వల్లే బతుకమ్మగా పేరొచ్చింది.
సద్దుల బతుకమ్మ రోజు మహిళలు తమ ఇళ్లలో పెసర, మినుములు, బియ్యం, నువ్వులతో రుచికరంగా ఉండే పొడి లేదా ముద్దను తయారు చేస్తారు. బతుకమ్మతో పాటు వీటిని తీసుకొని వేడుకలు జరిగే ప్రదేశానికి చేరుకుంటారు. నిమజ్జనం చేసే చోట ఈ పిండి పదార్థాలు పంచుతారు. అనంతరం మహిళలు వాయనం ఇచ్చి, పుచ్చుకుంటారు. ఇలా ఒకరికొకరు అందించి తమ అనుబంధాన్ని పంచుకుంటారు.
బతుకమ్మ పండగను తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఇంటిలోనూ సందడి నెలకొంటుంది. ముఖ్యంగా అమ్మాయిలున్న ఇళ్లల్లో సందడే సందడి.. ప్రతి రోజు బతుకమ్మను పూలతో పేర్చి మధ్యలో గౌరమ్మను ఉంచుతారు. గ్రామంలోని వీధి కూడళ్లు, దేవాలయాల ముందు, మైదానాలు, కాలువ గట్ల వద్ద పిల్లలు, పెద్దలు తేడా లేకుండా మహిళలంతా అక్కడికి చేరుకుంటారు. వారు పేర్చిన బతుకమ్మలను ఒక చోట ఉంచి.. వాటి చుట్టూ పాటలు పాడుతూ లయబద్ధంగా కోలాటమాడుతారు. ఇలా తొమ్మిది రోజుల పాటు చేస్తారు. చివరి రోజు నిమజ్జనం.. ఇది పెద్ద పండగ.. దీనినే సద్దుల బతకమ్మగా పిలుస్తారు. తంగేడు, గూనుగు, తామర, టేకు తదితర పూలతో బతుకమ్మలను పేర్చుతారు. తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడే బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.తెలంగాణ ఉద్యమానికి వూపిరి పోసిన బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యతమిస్తుందన్నారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో సంప్రదాయబద్ధంగా నిర్వహించే బతుకమ్మ పండుగ పాటలను కొత్త రకంగా రూపొందించడం హర్షణీయమన్నారు.