బతుకులు బాగుచేయండంటూ..బట్టలిప్పేశారు! ప్రధాని కార్యాలయం వద్ద తమిళ రైతుల నగ్న పోరాటం దిల్లీలో ఉద్ధృతంగా ఆందోళన

చెన్నై, న్యూస్‌టుడే: తమ కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి దిల్లీలో ఆందోళనచేస్తున్న తమిళ రైతుల పోరాటం ఉద్ధృతమవుతోంది. అర్ధనగ్నంగా ఆందోళన చేసినా, కపాలాల మాలలు మెడలో ధరించినా, ఎలుకలు నోట కరిచినా కేంద్రం పట్టించుకోలేదు. దిల్లీ రోడ్లపై పొర్లు దండాలు పెట్టారు, చెట్టెక్కి బలవన్మరణాలకు యత్నించారు. అయినా వారి గోడును ఎవరూవినలేదు. రాష్ట్రం కాని రాష్ట్రంలో, భాష రాని ప్రాంతంలో న్యాయం కోసం ఎలుగెత్తి 28 రోజులుగా ఆందోళన చేస్తున్నా స్పందన కరవవడంతో సోమవారం ఉదయం నగ్నంగా పోరాటానికి సిద్ధపడ్డారు. దిల్లీలోని ప్రధాని కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చి బయటకు వచ్చిన వెంటనే పంచెలు విప్పేసి నగ్నంగా రోడ్డుపై నడుస్తూ నినాదాలు చేశారు. అదే రోడ్డుపై పొర్లారు. ఈ హఠాత్పరిణామంతో నిర్ఘాంతపోవడం పోలీసులవంతయింది. వెంటనే వారినిఅరెస్టు చేశారు. రైతుల ప్రతినిధి అయ్యాకన్ను విలేకరులతో మాట్లాడుతూ.. తమిళనాడులోని రైతులు కరవు కోరల్లో చిక్కుకున్నారని, సాగునీరు లేక అల్లాడుతున్నారని తెలిపారు. దీనికి తోడు రైతుల బతుకులను చిదిమేసే హైడ్రోకార్బన్‌ ప్రాజెక్టును అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రధాని తమను పిలిచి మాట్లాడనందుకు నిరసనగా నగ్నప్రదర్శనకు దిగామన్నారు. ప్రధానితో భేటీకని నమ్మించి తమను ఆయన కార్యాలయానికి తీసుకొచ్చారని, వినతిపత్రమే తీసుకున్నారని..ఆయనను కలిసే అవకాశమివ్వలేదని పేర్కొన్నారు. దీంతో తమిళనాడు రైతుల దుస్థితిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఆ విధంగా పోరాడాల్సి వచ్చిందని వివరించారు.