బయ్యారం మండలంలో రోడ్లు అస్తవ్యస్థంగా మారినా పట్టించుకోని ఆర్ అండ్ బి శాఖ
*బయ్యారం మండలంలో రోడ్లు అస్తవ్యస్థంగా మారినా పట్టించుకోని ఆర్ అండ్ బి శాఖ*
బయ్యారం,జూన్ 04(జనంసాక్షి):
జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న బయ్యారం మండలంలో ప్రధాన రహదారులు నరకానికి దారులుగా మారాయి.రోడ్డు మరమ్మత్తులలో అధికారుల పర్యవేక్షణా నిర్లక్షం కారణంగానో, కాంట్రాక్టర్ల నాసిరకం పని తీరువల్లనో, కారణం ఏదైనా ప్రభావం మాత్రం సామాన్య ప్రజనీకం పైన పడుతుంది. ఎందరో రోజూ రోడ్డు ప్రమాదాల భారీనా పడుతూనే ఉన్నారు.నిత్యం రద్దీగా ఉండే మహబూబాబాద్ నుండి బయ్యారం మీదుగా ఇల్లందు, భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో, గతుకులతో తీవ్ర ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పాలకులుగాని, అధికారులుగాని పట్టించుకోవడంలేదని వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తపరుస్తున్నారు.బయ్యారం, గంధంపల్లి, కొత్తపేట లో రహదారి పూర్తిగా దెబ్బతిన్నది. బయ్యారం లో లారీ ఆఫీస్ ఎదురుగా హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో రహదారి గుంటగా మరి తీవ్ర ప్రమాదకారిగా మారిందన్న వార్త కథనాలు జనంసాక్షి ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దానిమీద స్పందించిన ఆర్ అండ్ బి శాఖ, దానిని ప్యాచ్ వర్క్ లో భాగంగా గత వారం పనిమొదలుపెట్టారు. కానీ ఇలాంటి గుంతలు, గతుకులు ఏర్పడిన రోడ్లు బయ్యారం నుండి ఇల్లందు వెళ్లే ప్రధాన రహదారి మొత్తం అస్తవ్యస్థంగా మారిన పరిస్థితి.గత సంవత్సరం ఈ రోడ్డు కారణంగా అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం కోల్పోయారు.అప్పటికప్పుడు తాత్కాలిక చర్యలలో భాగంగా అధికారులు ప్రపోజ్డ్ హై వే అని త్వరలో రోడ్డు విస్తరణ జరిగి కొత్త రహదారి ఏర్పాటు జరుగుతుందని ఆలోచనలో మహబూబాబాద్ నుండి నామాలపాడు వరకు 17 కిలోమీటర్ల ప్యాచ్ వర్క్ చేసి మమ అనిపించారు.కానీ 6నెలలు కూడా గడువక ముందే మళ్ళీ యదా స్థితికి చేరుకుంది.ఇందులో భాగంగా గంధంపల్లి -కొత్తపేట రహదారి పూర్తిగా ధ్వంసం అయ్యి నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం అయ్యాక స్పందించినా పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేమని,రాత్రుల్లో కొత్తగా ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వాపోతున్నారు.కాబట్టి ఇప్పటికైనా బయ్యారం, గంధంపల్లి, కొత్తపేట, నామాలపాడు లో రోడ్డు గురించి అధికారులు స్పందించాలని వాహనదారులు,స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.