బయ్యారం లో టీబీ వ్యాధి పట్ల కలరంజని కళాబృందం చే అవగాహ

బయ్యారం,జులై27(జనంసాక్షి):
మహబూబాబాద్ జిల్లా డిఎంహెచ్వో ఆదేశాల మేరకు  టీబీ అలర్ట్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బయ్యారంలో ఎంపీడీవో, సర్పంచ్, స్థానిక వైద్యులు,ఆశా వర్కర్లు,అంగన్వాడి సహకారంతో కళా రంజని కళాబృందం చేత టీబీ వ్యాధి ఏ విధంగా వస్తుంది,నివారణ చర్యలు ఏ విధంగా పాటించాలి అనే విషయమై బుధవారం అవగాహన  కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కళాకారులచే పాటల రూపంలో వ్యాధి యొక్క తీవ్రతను, వ్యాధి పట్ల జాగ్రత్తలు, సీజనల్  వ్యాధుల పట్ల అవగాహన కలిగించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళారంజని సందీప్ మాట్లాడుతూ… టీబీ వ్యాధి వ్యాధిగ్రస్తులు తుమ్మినా లేదా దగ్గినా గాలి ద్వారా లాలాజల తుంపర్ల రూపంలో ఇతరులకు సోకే ప్రమాదం ఉన్నదని, కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని  విజ్ఞప్తి చేశారు.రెండు వారాలకు మించి ఎడతెరిపి లేకుండా దగ్గు, జలుబు రావడం, దగ్గినప్పుడు తెమడ ద్వారా రక్తం పడటం, అప్పుడప్పుడు జ్వరం రావడం, బరువు తగ్గిపోవడం,ఛాతిలో నొప్పి,ఆకలి తగ్గిపోవడం,నీరసంగా ఉండడం లాంటివి టీబీ వ్యాధి ముఖ్య లక్షణాలని,టీబీ వ్యాధి సోకిన వారి లక్షణాలను ముందుగా గుర్తించి దగ్గర్లో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లి  సంబంధిత వైద్యులను సంప్రదించాలని  తెలియజేశారు. టీబీ వ్యాధికి  ప్రభుత్వం నుండి ఉచిత వైద్యం లభిస్తుందని, వైద్యులు సూచన మేరకు మూడు నెలల నుండి ఆరు నెలల వరకు వైద్యానికి సంబంధించిన కోర్సు వాడాలని, మందులు వాడే సమయంలో కడుపులో మంట,వాంతులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ  ఎటువంటి ఆందోళన చెందకుండా మందులు వాడాలనితెలియజేశారు. టీబీ వ్యాధి సోకిన వ్యాధిగ్రస్తులను దూరం చేయకుండా వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలని,టీబీ వ్యాధి సోకినవారు వ్యక్తిగత శుభ్రత పాటించాలని, పౌష్టికాహారంతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుండి టీబీ వ్యాధిగ్రస్తుల కొరకు ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని, లక్షణాలు కనిపించిన వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యం మొదలుపెట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత శుభ్రతను పాటించాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, త్రాగే నీరు  వేడి చేసి చల్లార్చి తాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చలపతిరావు, డాక్టర్ రవితేజ, డిస్టిక్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ విశాల్, టీబీ నోడల్ సూపర్వైజర్ జి.రామారావు, బ్లాక్ కోఆర్డినేటర్ డి.రాము, ఏఎన్ఎంలు  పరోశిని సమ్మక్క,ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, కళారంజని సందీప్ బృందం సందీప్,రవి,అర్జున్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.