బరితెగించిన వైకాపా
వరంగల్, డిసెంబర్ 18 (జనంసాక్షి) :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరితెగించింది. టీఆర్‌ఎస్ కార్యాలయాలపై భౌతిక దాడులకు దిగింది. వరంగల్‌లోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని వైకాపా నాయకులు మంగళవారం ముట్టడించారు. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో వారిని టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకు న్నారు. దిష్టిబొమ్మను లాక్కునేందుకు యత్నించగా కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పరిస్థితి రరఅదుపు తప్పింది. వైసీపీ నేతలు టీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడికి తెగపడ్డారు. రాళ్లు రువ్వారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో సమీపంలో ఉన్న కొన్ని షాపుల అద్దాలు పగిలిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. లాఠీచార్జి చేసి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దాడులు, లాఠీచార్జి నేపథ్యంలో టీఆర్‌ఎస్, వైఎస్సార్ సీపీలకు చెందిన .కార్యకర్తలు పలువురు గాయపడ్డారు. ఇదిలా ఉంటే, వరంగల్‌లో జరిగిన ఇరు పార్టీల మధ్య ఘర్షణ హైదరాబాద్‌ను తాకింది. టీఆర్‌ఎస్ తీరును నిరసిస్తూ.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌ను ముట్టడించేందుకు తరలివచ్చారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్‌ఎస్ కార్యాలయం ముందు బైఠాయించేందుకు యత్నించగా, టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జి చేసి, కార్యకర్తలను చెదరగొట్టారు. మరోవైపు, భారీగా తరలివచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు.