బరి నుంచి తప్పుకొన్న అభ్యర్థి

తంబళ్లపల్లిలో బిజెపికి షాక్‌
చిత్తూరు,మార్చి29(జ‌నంసాక్షి): తంబళ్లపల్లిలో చివరి రోజు భాజపాలో కొన్ని అనూహ్య పరిణామాలు సంభవించాయి. పార్టీ నుంచి బీఫాం అందుకున్న పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన మంజునాథరెడ్డి నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న చల్లపల్లికి చెందిన నరసింహమూర్తికు ఈసారి టిక్కెట్‌ రాలేదు. గతంలో పార్టీకు విధేయుడిగా ఉంటూ… పలుమార్లు పోటీ చేసిన ఆయనకు పార్టీ మొండిచేయి చూపింది. ఆన్‌లైన్‌ ద్వారా కోరిన మంజునాథరెడ్డికి కేటాయించింది. దీనిపై భాజపాలో ఓ వర్గం భగ్గుమంది. పార్టీని నమ్ముకున్న వారిని కాకుండా, ప్రజల్లో లేని వారికి టిక్కెట్‌ ఎలా ఇస్తారంటూ కార్యకర్తలు ప్రశ్నించారు. దీనిపై పార్టీ నేతలకు ఎలాంటి సంకేతాలు లేకుండానే… టిక్కెట్‌
సాధించిన మంజునాథరెడ్డితో రహస్య మంతనాలు జరిపారు. ఆఖరి క్షణంలో జరిగిన పరిణామాలతో చివరకు పార్టీ పోటీలో లేకుండా పోయింది. రాజంపేట లోక్‌సభ బరి నుంచి సైతం భాజపా తన అభ్యర్థిని ఉపసంహరించుకుంది. పోటీలో ఉన్న మహేశ్వరరెడ్డి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఓ సామాజిక వర్గం ఓట్లలో చీలిక వస్తుందనే కోణంలోనే ఆయణ్ను ఓ ప్రధాన ప్రాంతీయ పార్టీకి చెందిన నాయకుడు ఒత్తిడి తెచ్చి పోటీ నుంచి తప్పించారని తెలుస్తోంది. ఆ పార్టీకి పడే ఓట్లన్నీ తమకు బదలాయించేలా అంతర్గతంగా ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులను దారిలోకి తెచ్చుకునేందుకు బుధ, గురువారాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు బుజ్జగించారు. చాలామంది ప్రభావం చూపే వారు కాకపోవడంతో పాటు.. కొందరిని కావాలనే బరిలోకి దింపారు. నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ వంటి కీలక పక్రియలు ముగియడంతో.. అన్ని పార్టీల నేతలు ఇక ప్రచారం బాటపట్టాయి. అధినేతలు, స్టార్‌ క్యాంపెయినర్స్‌ పర్యటనపై షెడ్యూలు రూపొందిస్తున్నారు.