బల్దియాపై జెండా పాతకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా

5

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,జనవరి11(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురకున్నా మేయర్‌ పదవి దక్కకున్నా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఐటి,పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కెటిఆర్‌ సవాల్‌ విసిరారు. ఇందుకు కాంగ్రెస్‌,బిజెపి, టిడిపి నేతలు రాజీనామాకు సిద్దంగా ఉన్నారా అని మంత్రి ప్రశ్నించారు.  జీహెచ్‌ఎంసీలో వంద సీట్లతో గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. రెండోస్థానంలో ఎంఐఎం, బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంటుందన్నారు. ఇక కాంగ్రెస్‌కు  10 సీట్లు కూడా దక్కవని కేటీఆర్‌ జోస్యం చెప్పారు. తన సవాల్‌కు  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కిషన్‌ రెడ్డి సిద్ధమా అని ఆయన డిమాండ్‌ చేశారు. గత 50 ఏళ్లలో ఎవరూ చేయని పనులను తాము అయిదేళ్లలో చేస్తామని కేటీఆర్‌ హావిూ ఇచ్చారు. తెలంగాణ జర్నలిస్టుల విూట్‌ద ప్రెస్‌ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గ్రేటర్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ను విశ్వనగరంగా చేసే క్రమంలో తాము అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. హైదరాబాద్‌ అభివృద్ది అంటే భవనాల నిర్మాణం కాదని, మౌలిక సదుపాయాల కల్పన అని అన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ కు కరెంటు కట్‌ లేకుండా ప్రభుత్వం చేసిందని ఆయన అన్నారు. హైదరాబాద్‌కు గత ఏభై ఏళ్లలో ఇతర పార్టీలు చేయని అబివృద్ది పనులు తాము చేసి చూపుతామని, ఐదేళ్లు తమకు అవకాశం ఇవ్వాలని కెటిఆర్‌ కోరారు. హైదరాబాద్‌ అంటేనే మినీ ఇండియా అని కేటీఆర్‌ పేర్కొన్నారు. దేశంలోనే నెంబర్‌వన్‌గా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. గతంలో పరిపాలన ప్రజలు ఆశించిన మేర జరగలేదు. ప్రజల కనీస అవసరాలు తీర్చడమే ముఖ్యం. ఆ దిశగానే ప్రభుత్వ పాలన ఉంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోకి రాకముందు ఎన్నో పుకార్లు జరిగాయి. సీఎం కేసీఆర్‌ పాలనపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది. అపోహలకు తావులేకుండా పోయిందన్నారు. తెలంగాణలోని 30 శాతం జనాభా హైదరాబాద్‌ లోనే ఉంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు.గత పాలకుల హయాంలో వారానికి రెండు రోజులు పవర్‌ హాలీడేలు ఉండేవని,  కరెంట్‌ సమస్యలతో పారిశ్రామికవేత్తలు రోడ్లపై ధర్నాలు చేశారు. రాష్ట్రంలో కరెంట్‌ సమస్య లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే. ఇప్పుడు కరెంట్‌ సమస్యలు లేవు. అన్ని విధాలా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని వ్యాఖ్యానించారు. వచ్చే 6 నెలల్లో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఈ 18 నెలల్లో హైదరాబాద్‌కు ఎన్నో పరిశ్రమలు వచ్చాయని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గూగుల్‌, అమెజాన్‌, ఉబెర్‌ లాంటి ఎన్నో కంపెనీలు హైదరాబాద్‌కు  వచ్చాయన్నారు. ఇప్పటికీ హైదరాబాద్‌లో ద్లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ముందుగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఇక హైదరాబాద్‌ మహా నగరాన్ని అత్యున్నత సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. కాగా తనకు మంత్రి పదవే ఎక్కువని…. ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన కలలో కూడా లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో మోస్ట్‌ గ్లామరస్‌ లీడర్‌ కేసీఆరే అని, గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి తమకు సినిమా హీరోలు అవసరం లేదని ఆయన అన్నారు. జర్నలిస్టుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని అన్నారు.