బస్సు చార్జీల పెంపు తప్పదు

3

: రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి

హైదరాబాద్‌,మే21(జనంసాక్షి):  బస్సు ఛార్జీలు పెంపు అనివార్యం కాబోతోందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి సూచనప్రాయయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని  మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆర్టీసీ లోగోను  గురువారం ఆవిష్కరించిన మంత్రి మహేందర్‌రెడ్డి  మాట్లాడుతూ.. ఛార్జీలు ఎంతమేర పెంచాలనేది నిర్ణయించలేదన్నారు. తప్పని పరిస్థితుల్లోనే ఛార్జీలు పెంచాల్సి వస్తోందన్నారు. ఇదిలావుంటే ఈ నెల 28 నుంచి ఆర్టీసీ తెలంగాణ ప్రత్యేకంగా తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందన్నారు. అటు విభజనతో పాటే ఛార్జీల మోత మోగించేందుకు సర్కార్‌ రెడీ అయ్యింది. అయితే  ఇప్పటికే విభజన ప్రక్రియ పూర్తయ్యిందని మంత్రి  అన్నారు.  ప్రతీ నియోజకవర్గం నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలో 500 కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. అనంతరం బస్సు నడిపి సందడి చేశారు.మంత్రి చేసిన ప్రకటనతో త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి. డీజిల్‌ ధరలు పెరగడం..సిబ్బంది జీతాలు అధికం కావడం వల్లే ధరలు పెంచాల్సి వస్తుందని పేర్కొన్నారు. అలాగే ఏపీ ఆర్టీసీ బస్సులకు పన్నులు వసూలు చేస్తామని, ఈనెల 28 నుండి వేర్వేర్వుగా కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు మంత్రి మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న ఆర్టీసీ ఆస్తులు ఈ ప్రాంతానివే అని మహేందర్‌ రెడ్డి వెల్లడించారు. ఆంధ్ర నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులకు ఎంట్రీ ట్యాక్స్‌ చెల్లించాల్సిందేని చెప్పారు. ఈ నెల 28  నుంచి ఆర్టీసీ రెండుగా విడిపోతున్నాయని మంత్రి వివరించారు. దశల వారీగా ఆర్టీసీ ఛార్జీల ధరలను పెంచుతామని ఇటీవలే సీఎం కేసీఆర్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. అంతకంటే ముందు ఛార్జీలు పెంచడానికి అనుమతి ఇవ్వాలని పలుమార్లు ప్రభుత్వానికి యాజమాన్యం విన్నపాలు చేస్తూ వచ్చింది. కానీ దీనిని ప్రభుత్వం పెండింగ్‌ లో పెట్టింది. ఇటీవలే 43 శాతం ఫిట్‌ మెంట్‌ ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు గత కొద్ది రోజులుగా సమ్మె చేసి విజయం సాధించారు. వీరికి 44 శాతం ఫిట్‌ మెంట్‌ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే  డీజిల్‌ ధరలను కేంద్రం పెంచింది. దీనితో ధరల పెరుగుదల..వేతనాలు అధికం కావడం వల్ల ఆర్టీసీ సంస్థపై పెనుభారం పడుతోందని యాజమాన్యం భావిస్తోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ మరింత నష్టాల్లోకి వెళుతుందని దీనికి ఆర్టీసీ ఛార్జీలు పెంచడమే శరణ్యమని యాజమాన్యం భావించింది. దీనిపై ఓ కమిటీని నియమించారు. ఆర్టీసీ ఛార్జీలు ఎంత మేరకు పెంచాలనే దానిపై ఈ కమిటీ నివేదిక అందచేయనుంది. ఈ నివేదికను ప్రభుత్వానికి అందచేసిన తరువాత ఛార్జీలను పెంచడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా 15 శాతం పెంచేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ నష్టాల్లో ఉండడానికి కారణం ప్రభుత్వ విధానాలే కారణమని పలు కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి. డీజిల్‌ ధరల పెరుగుదల..వేతనాల పెంపును సాకుగా చూపెట్టి ఆర్టీసీ ఛార్జీల పెంచడానికి చూస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిపుణులు..తాము సూచించిన విధానాలు అవలంబిస్తే నష్టాల నుండి బయట పడొచ్చని పేర్కొంటున్నారు. ఇదిలావుంటే ఈ లోగోను జ్ఞానేశ్వర్‌ అనే కళాకారుడు రూపొందించాడు. రౌండెడ్‌ ఫ్రేమ్‌లో కాకతీయ కళాతోరణం, కళాతోరణం మధ్యలో చార్మినార్‌, తెలుపు రంగులో రహదారి, రహదారి మధ్యలో గీతలు ఉన్నాయి. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉన్న ఈ లోగోను జ్ఞానేశ్వర్‌ అనే కళాకారుడు రూపొందించారు. ప్రగతి రథం, ప్రజల నేస్తం అనే తెలుగు స్లోగన్‌ కూడా ఈ లోగోలో భాగమయ్యింది. లోగో విడుదలతో  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు కొత్త లోగోతో రోడ్డెక్కనున్నాయి. లోగో సృష్టికర్త జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ.. పసుపు రంగు సీఎం కేసీఆర్‌ కలలు కంటోన్న బంగారు తెలంగాణను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఆకుపచ్చ రంగు గ్రీన్‌ తెలంగాణ అంటోన్న సీఎం కేసీఆర్‌ ఆశయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.