బస్సు ఢీ కొని వ్యక్తి మృతి … మరొకరి పరిస్థితి విషమం

బోయినిపెల్లి, జూలై 31 (జనంసాక్షి) : బోయినిపెల్లి మండలం శాబాష్‌పల్లి కల్వర్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం బోయినిపెల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన ర్యాకం మల్లేశం (26) తో పాటు బాలగోని శేఖర్‌ అనే యువకులు తమ స్వంత పని నిమిత్తం బైక్‌పై సిరిసిల్లకు వెళ్లి తిరిగి వస్తుండగా శాబాష్‌పల్లి కాజ్‌వే వద్ద కరీంనగర్‌ నుంచి సిరిసిల్ల వెళుతున్న నాన్‌ స్టాప్‌ బస్సు (సిరిసిల్ల డిపో బస్సు నెం. 4336) ఢీ కొనడంతో మల్లేశం అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, శేఖర్‌కు తీవ్రగాయాలై ప్రాణాపాయ పరిస్థితిలో కోమాలోకి వెళ్ళాడు. కాగా బస్సు ఢీ కొన్న విషయం తెలిసిన వెంటనే  సమీపంలోనే ఉన్న కొదురుపాకలోని మృతుని బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ, బస్సుపై దాడి చేసి ధ్వంసం చేశారు. అనంతరం ఆదే రోడ్డుపై వస్తున్న మరో రెండు బస్సుల్ని పెట్రోలు పోసి తగలపెట్టి, మరో బస్సును కూడా ధ్వంసం చేశారు. కాగా బస్సులు తగలబడ్డ విషయాన్ని తెలుసుకున్న వెంటనే సిరిసిల్లా నుండి ఫైరింజన్‌ రావడంతో దానిని కూడా రాకుండా మృతుని బంధువులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించడంతో సుమారు 3 గంటల పాటు రోడ్డు కిరుపక్కలా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.  విషయం తెలిసిన వేములవాడ సీఐలు జితేందర్‌రెడ్డి, ఉపేందర్‌లతో పాటు పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న ప్రజలను లాఠీఛార్జీ చేసి చెల్లాచెదరు చేశారు.

– దారి మళ్లించిన వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు :

శాబాష్‌పల్లి కాజ్‌వే వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన యువకుని బంధువులు రాస్తారోకో నిర్వహించడంతో వేములవాడ నుండి బోయినిపెల్లి మీదుగా బస్సులు, ఇతర వాహనాలను దారి మళ్లించడంతో స్తంబంపెల్లి, బోయినిపెల్లి గ్రామాల వద్ద గ్రామస్తులు వాటిని అడ్డుకున్నారు. బస్సులపై కోడి గుడ్లు, రాళ్ళు విసిరి నిరసన తెలిపారు. తమ గ్రామాల నుంచి వెళ్లే రోడ్లు ఇది వరకే చెడిపోవడంతో నానా ఇబ్బందులకు గురవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజావార్తలు