బాధితులకు సత్వర సాయం
ప్రత్యేకాధికారి మురళీధర్‌రెడ్డి
అమలాపురం,జూలై19(జనంసాక్షి): గోదావరి వరదల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం సత్వరమే ఆదుకుంటుందని కోనసీమ జిల్లాకు వరద ప్రత్యేకాధికారిగా నియమితులైన ఏపీ ఎంఎస్‌ఐ డీసీ మేనేజింగ్ డైరెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. జిల్లాలో పద్దెనిమిది మండలాల పరిధిలో 70 గ్రామాల్లో సుమారు 30వేల
మంది బాధితులను ఖాళీ చేయించినట్టు తెలిపారు. 9,236 మందికి పునరావాసం కల్పించామని, 2,43,185 మందికి ఆహారం, పాలు, కొవ్వొత్తులు అందించామన్నారు. కలెక్టర్ చొరవతో వరద గ్రామాల్లోని బాధితులకు పది కిలోల బియ్యం, కేజీ కందిపప్పును పంపిణీ చేశామని తెలిపారు. రాగల 48 గంటల్లో వరద ముంపు బారిన పడిన ప్రతీ రేషన్‌కార్డుదారునికి సహాయం అందించాల్సిందిగా సిఎం ఆదేశాలిచ్చారని మురళీధర్‌రెడ్డి తెలిపారు. 36 వేల రేషన్ కార్డుదారులను గుర్తించామని, వీరికి రానున్న రెండు రోజుల్లో కార్డుకు రూ.2 వేలు వంతున ఆర్థిక సాయం ఆన్‌లైన్ ద్వారా జమ చేస్తామని ప్రకటించారు. ప్రతీ కుటుంబానికి 25 కిలోల బియ్యం, కందిపప్పు, మంచినూనె, కిలో ఉల్లిపాయలు, బంగాళాదుంపలను పంపిణీ చేసేందుకు అన్నీ సిద్ధం చేశామని తెలిపారు. ఎవరికైనా సాయం అందని పక్షంలో 48 గంటల తరువాత టోల్‌ఫ్రీ నంబరు 08856 293104, వాట్సాప్ నంబరు 9949515348కు ఫిర్యాదు చేయవచ్చని వారు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ రిలీఫ్ అందకపోయినట్టు సచివాలయాలకు ఫిర్యాదు చేస్తే వాటిని పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. 54 వేల లీటర్ల పాలు, 450 టన్నుల బియ్యం, 45 టన్నుల కందిపప్పు, 22 వేల లీటర్ల పామాయిల్, 30 మెట్రిక్ టన్నుల చొప్పున బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, టమోటాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రోజూవారీగా 24 వేల ఆహార పొట్లాల పంపిణీ చేస్తున్నామని, 10 వేల మందికి పునరావాస కేంద్రాల్లో వసతి కల్పిస్తున్నట్టు తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసు బలగాలు బాధితులకు సేవలు అందిస్తున్నాయని జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వరద నియంత్రణా చర్యల్లో వలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేసిందని, 350 కిలోవిూటర్ల మేర ఏటిగట్లలో ఏర్పడిన లీకేజీలను అరికట్టడంలో ఇంజనీర్ల ఆధ్వర్యంలో 1200 మంది వలంటీర్లు పనిచేశారని ప్రత్యేకాధికారి మురళీధర్‌రెడ్డి తెలిపారు. వరద బాధితులందరికీ సంపూర్ణ సేవలు అందిస్తున్నామని, ఇందుకు కృషి చేస్తున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డిలను ఆయన అభినందించారు.