బాధ్యతగా పనిచేయండి

– పేదలు, గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి
– నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు
– డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆగ్రహం
– సిబ్బంది పనితీరులో మార్పు రావాలి – ఆళ్ల నాని
– కింగ్‌ జార్జి ఆస్పత్రిలో తనిఖీలు చేసిన డిప్యూటీ సీఎంలు, మంత్రులు
విశాఖపట్నం, ఆగస్టు24 (జనంసాక్షి) : విధుల పట్ల బాధ్యతగా పనిచేయాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని డిప్యూటీసీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. శనివారం  కింగ్‌ జార్జి  ఆసుపత్రిలో వివిధ విభాగాలను డిప్యూటీ సీఎంలు ఆళ్ల నాని, పుష్పశ్రీవాణి, మంత్రులు అవంతి శ్రీనివాస్‌, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు తనిఖీ చేశారు.
అనంతరం జెడ్పీ హాలులో సవిూక్షా సమావేశంలో వీరంతా పాల్గొన్నారు. పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. కేజీహెచ్‌లో కొందరి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గతంలో కొన్ని మరణాలు సంభవించాయని తెలిపారు.
కింగ్‌ జార్జి ఆసుపత్రిలో అవినీతి పెరిగిపోయిందన్నారు. పోస్టు మార్టం చేయడానికి కూడా గిరిజనులు, పేదల నుంచి లంచం తీసుకుంటున్నారని మండిపడ్డారు. గిరిజనులు వస్తే విూ కుటుంబ సభ్యులుగా స్పందించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పేదలు, గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలనే కృత నిశ్చయంతో సీఎం  జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా వైద్యులు పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ.. కేజీహెచ్‌లో వైద్యులు, సిబ్బంది పనితీరు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజనులకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. శానిటేషన్‌ కూడా అధ్వాన్నంగా ఉందన్నారు. కేజీహెచ్‌లో పరిస్థితులు మారాలని కోరారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి నిరుపేదకి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం నెరవేరేలా పనిచేయలన్నారు. వైద్యులు, సిబ్బంది తీరు మార్చుకోవాలని మళ్లీ మళ్లీ వచ్చి తనిఖీలు చేస్తానని హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న బ్లాక్‌ల స్థానంలో కొత్త భవనాలు నిర్మించడానికి  సీఎం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. ఎంసిహెచ్‌లో అదనపు బ్లాక్‌ను మంజూరు చేస్తామని చెప్పారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. పేదలకు కేజీహెచ్‌లో సరైన వైద్యం అందండం లేదని అన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కేజీహెచ్‌లో అవినీతి పెరిగిపోయిందన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి.. బంధువులకి అప్పగించడానికి కూడా లంచాలు తీసుకుంటున్న దుస్థితి ఉందన్నారు. ఆసుపత్రిలో అవినీతిని రూపు మాపాలన్నారు. కేజీహెచ్‌ను అవినీతి రహితంగా తీర్చిదిద్దాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ బ్జడెట్‌లో అధిక వాటాను ఉత్తరాంధ్రకు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. కేజీహెచ్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి సహకరించాలన్నారు. వీఎంఆర్‌డీఎ చైర్మన్‌ మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్సార్‌ హయాంలో కేజీహెచ్‌ ఆసుపత్రి బాగా అభివృద్ధి చెందిందని అన్నారు. ఆయన హయాంలో రూ. 35 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖకు వైఎస్సార్‌ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కూడా వైద్యం, విద్యపై దృష్టి పెట్టారన్నారు. కేజీహెచ్‌కు రెండు కోట్ల అదనపు బ్జడెట్‌ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేజీహెచ్‌లో అదనపు బెడ్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. అనకాలపల్లి ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీతో పేదలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. కేజీహెచ్‌లో చిన్న పిల్లల వార్డుకి మౌలిక సదుపాయాలు పెంచాలని కోరారు. ఈ సవిూక్షా సమావేశంలో మంత్రులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జవహర్‌రెడ్డి, కలెక్టర్‌ వినయ్‌చంద్‌, ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, గొడ్డేటి మాధవి పాల్గొన్నారు.