బాధ్యతలను విస్మరించిన తెబొగకాసం: ఐఎన్టీయూసీ
ఆదిలాబాద్,మార్చి2(జనంసాక్షి): సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించవల్సిన ప్రధాన బాధ్యత గుర్తింపు సంఘమైన తెబొగకాసం సంఘంపైనే ఉందని ఎమ్మెల్సీ, ఐఎన్టీయూసీ ప్రసిడెంట్ బి.వెంకట్రావ్ అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారించడంలో గుర్తింపు సంఘం పూర్తిగా విఫలం కావడంతోనే ఇతర సంఘాల వారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం గుర్తింపు సంఘంగా ఉన్న తెబొగకాసం సంఘం పని తీరును కార్మికులు గమనిస్తున్నారని, ఇప్పటి వరకు పింఛన్‌లో గుర్తింపు సంఘం ఎలాంటి అగ్రిమెంట్లు చేయలేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం జరిగే జేసీసీ సమావేశాలు సరిగ్గా జరుగడంలేదన్నారు.ప్రత్యేక రాష్ట్రంలో కార్మికులకు ప్రత్యేక ఇంక్రిమెంట్లు రావడం గొప్ప విషయమని, వారసత్వ ఉద్యోగాలు ఇప్పించడానికి జాతీయ సంఘమైన ఐఎన్టీయూసీ కృషి చేస్తుందన్నారు.సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల సాధన ధ్వేయంగా ఐఎన్టీయూసీ కృషి చేస్తుందని అన్నారు. 1998లో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయని, ఎన్నికలు జరిగినప్పటీ నుంచి సమ్మెలు, ఆందోళనలు, పోరాటాలు తగ్గుముఖం పట్టాయన్నారు. సమ్మెలకు బదులు సంప్రదింపులు ద్వారానే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఐఎన్టీయూసీ సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఎన్నికల సమయంలో గెలిచిన తర్వాత 24వేల మంది కార్మికులకు పదోన్నతలు ఇప్పించినట్లు చెప్పారు. దవీ విరమణ పొందిన కార్మికులకు పూర్తి స్థాయిలో గ్రాట్యూటీ,గని ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు అదనంగా రూ.6లక్షలు ఇప్పించడానికి ఐఎన్టీయూసీ కృషి చేసిందన్నారు.



