బాపినీడు మృతికి సిఎం కెసిఆర్‌ సంతాపం

హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): ప్రముఖ దర్శక నిర్మాత  విజయ బాపినీడు మృతి పట్ల తెలంగాణ
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. బాపినీడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగు సినీరంగంపై బాపినీడు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. తెలుగులో అనేక చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. శోభన్‌బాబు, చిరంజీవి లాంటి అగ్రహీరోలతో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి మంచి గుర్తింపు పొందారు.  ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు మృతిపట్ల సినీ నటుడు మంచు మోహన్‌బాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను ఎంతగానో బాధించిందని తెలిపారు. ‘బాపినీడుతో నాకున్న పరిచయం నేటిది కాదు. 1990 నుంచి ఆయన నాకు బాగా తెలుసు. నాకు అత్యంత సన్నిహితమైన వ్యక్తుల్లో బాపినీడు ఒకరు. మయూరి సంస్థలో పనిచేస్తున్న రోజుల నుంచి బాపినీడుతో నాకు సాన్నిహిత్యం ఉంది. ఎంతో మృదుస్వభావి. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. బాపినీడు మంచి దర్శకుడు మాత్రమే కాదు.. అంతకుమించిన మంచి రచయిత, సంపాదకుడు. అభిరుచి గల నిర్మాత. చాలా కష్టపడతారు. ఆయనలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.’ అని తెలిపారు.