బాబా క‌న్నేశాడు: టార్గెట్ మెక్‌డొనాల్డ్‌

ఇప్ప‌టికే భార‌త మార్కెట్లో  ఆయుర్వేద ఔష‌ధాల‌తో త‌న‌దైన శైలితో దూసుకుపోతున్న బాబా రాందేవ్ కంపెనీ ప‌తంజ‌లి తాజాగా రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. దేశంలో చాలామంది విదేశీ ఆహారానికి అల‌వాటు ప‌డి ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నార‌ని చెప్పిన ప‌తంజ‌లి బ్రాండ్ అంబాసిడ‌ర్ బాబారాందేవ్‌…త్వ‌ర‌లో రుచిక‌ర‌మైన భార‌తీయ వంటకాల‌తో త‌మ రెస్టారెంట్లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని అన్నారు.  మెక్ డొనాల్డ్‌, స‌బ్‌వే, కెంట‌కీ ఫ్రైడ్ చికెన్‌(కేఎఫ్‌సీ)లాంటి విదేశీ రెస్టారెంట్ల‌కు గ‌ట్టిపోటీనిస్తామ‌ని బాబా రాందేవ్ వెల్ల‌డించారు.

బాబారాందేవ్‌కు ఆయ‌న కంపెనీ నుంచి త‌యార‌య్యే ఉత్ప‌త్తులకు భార‌త్‌లో మంచి ఆద‌ర‌ణ ఉండ‌టంతో రెస్టారెంట్ వ్యాపారానికి ఇది క‌లిసొచ్చే అంశం అని ఆర్థిక నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేకాదు విదేశీ రెస్టారెంట్ల‌కు ప‌తంజ‌లి రెస్టారెంట్లు గ‌ట్టిపోటీనిచ్చే అవ‌కాశాలు మెండుగా ఉన్న‌ట్లు వారు తెలిపారు. భార‌త రిటైల్ బిజినెస్‌లో ఒక్క‌ ఆహారానికి సంబంధించిన వ్యాపార‌మే 57శాతంగా ఉంద‌ని ..ఇది 2025 నాటికి మూడురెట్లు అంటే రూ.71ల‌క్ష‌ల కోట్లకు పెరిగే అవ‌కాశ‌ముంద‌ని ఇండియా ఫుడ్ ఫోరం అనే సంస్థ పేర్కొంది.

2016-17లో ప‌తంజ‌లి టర్నోవ‌ర్ రూ.10వేల500 కోట్లుగా ఉంద‌ని బాబా రాందేవ్ వెల్ల‌డించాడు.300బిలియ‌న్ రూపాయ‌ల మేరా ఉత్ప‌త్తులు త‌యారు చేసే సామ‌ర్థ్యం ప‌తంజ‌లికి ఉంద‌న్న బాబా రాందేవ్‌…వ‌చ్చే ఏడాదిక‌ల్లా దీన్ని రెండింత‌లు చేసే ల‌క్ష్యంతో ప‌నిచేస్తామ‌ని వివ‌రించారు. అంతేకాదు వ‌స్త్ర‌వ్యాపారంలోకి కూడా ప‌తంజ‌లి ప్ర‌వేశించే యోచ‌న‌లో ఉంద‌ని… దేశం కోసం అమ‌రులైన జ‌వాన్ల పిల్ల‌ల‌కు విద్యనందించేందుకు స్కూళ్లు కూడా ప్రారంభిస్తామ‌ని చెప్పారు యోగా గురు రాందేవ్‌.