బాబు ! ఈసారైనా మాటపై ఉండు

పాదయాత్రలో బాబును కలిసిన టీ జేఏసీ
సుల్తానాబాద్‌, డిసెంబర్‌ 25 (జనంసాక్షి) :
చంద్రబాబూ.. తెలంగాణపై ఈసారైనా మాటపై ఉండాలని, 28న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో పార్టీ పక్షాన ఒకే వైఖరి చెప్పాలని టీ జేఏసీ డిమాండ్‌ చేసింది. కరీంనగర్‌ జిల్లా ఓదెల మండలం కొలనూర్‌లో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న చంద్రబాబునాయుడును జేఏసీ పక్షాన
కో చైర్మన్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయనతో ఈ సందర్భంగా జేఏసీ నేతలు జై తెలంగాణ అనిపించేందుకు ప్రయత్నించినా పట్టించుకుకోకుండా పాదయాత్రను కొనసాగించారు. దీనిపై తెలంగాణ జేఏసీ నాయకులు మండిపడ్డారు. 2009 డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాన రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తే బాబే అడ్డం తిరిగి అడ్డుకున్నారని ఈ విషయాన్ని టీ టీడీపీ నేతలు గుర్తించాలని సూచించారు. అఖిలపక్షంలో స్పష్టమైన వైఖరి చెప్తే చాలని ఇక్కడ పాదయాత్రలు చేసి ఎవరినీ ఉద్దరించాల్సిన అవసరం లేదన్నారు. టీ టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బాబుపై ఒత్తిడి తెచ్చి తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో వారికి తగిన రీతిలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆయన వెంట జేఏసీ నాయకులు దయాకర్‌, రవీందర్‌రెడ్డి, టీఎన్‌జీవోస్‌ ప్రధాన కార్యదర్శి హమీద్‌, బాలనర్సయ్య, మధు, సత్యం, వెంకటమల్లయ్య, మణిపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, కనరాజు తదితరులు ఉన్నారు.