బాబు తప్పించుకోలేడు

5
– రైతులకు నిరంతర విద్యుత్‌

– మంత్రి కేటీఆర్‌

మెదక్‌,జూన్‌19(జనంసాక్షి):

రైతు సంక్షేమం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని గ్రావిూణాభివృద్ధి కెటి రామారావుచెప్పారు. రైతులకు వచ్చే మార్చి నుంచి ఉదయం పూటనే విద్యుత్‌ ఇస్తామని అన్నారు. ఇందుకు సిఎం కెసిఆర్‌ పక్కాగా ప్రణాళిక రూపొందించి, పనిచేస్తున్నారని అన్నారు. మెదక్‌లో వాటర్‌ గ్రిడ్‌ పైలాన్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ  ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తప్పించుకోలేడని, బాబు  పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. స్టాంపుల కుంభ కోణం కేసులో ఆరోపణలు రావడంతో ఆనాడు కృష్ణయాదవ్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించావు కదా మరి ఇవాళ రేవంత్‌రెడ్డిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేయడంలేదని మంత్రి ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నీతులు, ఉపదేశాలు చెప్పడం కాదు వాటిని పాటించాలని సూచించారు. చంద్రబాబు తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకోవాలని చూస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు విచారణను ఎదుర్కొని తన నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. చట్టం ముందు అందరూ సమానులేనని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 76 శాతం పన్ను వసూలు చేశామని పేర్కొన్నారు. ప్రజల పన్నులతోనే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందన్నారు. త్వరలోనే పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఈ నెలలోనే రైతులకు రెండో దశ రుణమాఫీ చేస్తామని హావిూ ఇచ్చారు. రైతులకు కొత్త రుణాలు కూడా ఇస్తామన్నారు. రాజకీయాల్లో తనను తాను నిప్పు లాంటి మనిషినని చంద్రబాబు చెప్పుకొంటారని, ఇప్పుడు ఏసీబీకి సహకరించి నిప్పువో.. కందిపప్పువో నిరూపించుకోవాలని ఆయన సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసభాపతి పద్మాదేవేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.