బాబు మోచేతి నీళ్లుతాగే జేడీకి.. 

మా పార్టీలో స్థానమా?
– లక్ష్మీనారాయణపై విజయసాయి ఘాటు వ్యాఖ్యలు
అమరావతి, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వర్సెస్‌ జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మధ్య వారంరోజులుగా ట్వీట్‌ వార్‌ నడుస్తుంది.. విజయసాయి ట్వీట్లకు వరుసగా కౌంటర్లు ఇస్తూ వచ్చిన జేడీ.. ఒక్కసారిగా సైలెంటయ్యారు. ఈ ట్వీట్లపై స్పందించి తన సమయాన్ని వృధా చేసుకోనని.. అవసరమైతే జనసైనికులు స్పందిస్తారని క్లారిటీ ఇచ్చారు. కానీ విజయసాయి మాత్రం లక్ష్మీనారాయణను వదలడం లేదు.. వరుసగా ఘాటు ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. శనివారం జేడీ తన ట్వీట్‌లో వైసీపీ కూడా తనను ఆహ్వానించిందని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి తాజాగా ట్వీట్‌లో ఖండించారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే జేడీకి మా పార్టీలో ఎన్నటికీ స్థానం లేదని, ఉండదు
కూడా అని అన్నారు. బహుశా ఆయనే చేరాలనుకున్నారేమో అని విజయసాయి ట్వీట్‌ చేశారు. కోవర్టు ఆపరేషన్ల కోసం వచ్చే ఆలోచన చేశారని ఇప్పడు అనిపిస్తుందన్నారు. సీబీఐ లాంటి సంస్థను బాబుకు పాదాక్రాంతం చేసిన వ్యక్తి దేశాన్ని మార్చే కలలు కంటున్నాననడం పెద్ద జోక్‌ అంటూ ఎద్దేవా చేశారు. ఈవీఎంలపై చంద్రబాబు మతితప్పి మాట్లాడుతుంటే దాన్నిబలపరుస్తూ కాంగ్రెస్‌ కూడా రంగంలోకి దిగిందని విజయసాయి విమర్శించారు. ఘోర పరాజయం తర్వాత ఎన్నికలను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండు చేసినా ఆశ్చర్యం లేదని, పోలింగ్‌ బూత్‌లకు వెళ్లి ఓటేసిన 80శాతం మంది ప్రజలకు లేని అనుమానాలు తుప్పు బాబుకు వస్తున్నాయన్నారు. అమరావతిలోని ప్రజావేదిక ప్రభుత్వ ప్రాంగణాన్ని టీడీపీ కార్యక్రమాల కోసం చంద్రబాబు ఇప్పటి వరకు దానిని దుర్వినియోగం చేస్తూ వచ్చారని అన్నారు. కోడ్‌ అమలులో ఉన్నా తాను ఆపద్ధర్మ సీఎం అని మర్చిపోయి అదే ప్రజావేదికలో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళినే హేళన చేస్తున్నారంటూ విజయసాయి మండిపడ్డారు.