బాయిలర్‌ దుర్ఘటన బాధితులకు రాహుల్‌ పరామర్శ

లక్నో,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఎన్డీపీసీ బాయిలర్‌ పేలిన ఘటనలో గాయపడ్డ వారిని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పరామర్శించారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రాయ్‌ బరేలీ బయల్దేరి వచ్చారు. బరేలీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను

పరామర్శించారు. ప్రస్తుతం రాయ్‌ బరేలీ నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలపై రాహుల్‌ ఆరా తీశారు. ఘటనకు గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్టీపీసీలో బాయిలర్‌ పేలిన ఘటనలో 26 మంది మృతి చెందగా,మరో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

ఎన్టీపీసీ లో బాయిలర్‌ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 26కు చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఏడుగురు మృతి చెందారు. బాయిలర్‌ పేలడంతో తొలుత 18 మంది మృతి చెందారు. సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. అయితే వారిలో 35 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం లక్నోకు తరలించారు. అందులో ఏడుగురు చికిత్స పొందుతూ మరణించినటట్లు డాక్టర్లు తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలీ జిల్లాలోని ఉంచహర్‌ ప్లాంట్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.