బార్డర్ ప్రజలకు బాసటగా నిలవాలి
– రాహుల్
శ్రీనగర్, ఆగస్ట్ 26 (జనంసాక్షి):
సరిహద్దు గ్రామాల ప్రజల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. గ్రామస్థులకు, వారి ఆస్తులకు, పంట పొలాలకు బీమా సౌకర్యం కల్పించాలని, కాల్పుల సమయంలో దాక్కోవడానికి తమకు బంకర్ సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారని రాహుల్ వెల్లడించారు. పాకిస్థాన్- భారత సరిహద్దు గ్రామాలను రాహుల్‌గాంధీ బుధవారం సందర్శించారు. జమ్మూకశ్మీర్‌లోని బాలకోట్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఇటీవల పాకిస్థాన్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దులో కాల్పులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.తరచూ కాల్పుల వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని అక్కడి ప్రజలు తమ ఆవేదనను వెల్లడించారు. బాలకోట్ సెక్టార్‌లో ఆగస్టు 15న పాక్ కాల్పుల కారణంగా ఆరుగురు మృతిచెందారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కాల్పుల కారణంగా మరణించిన వారి కుటుంబసభ్యులకు నష్టపరిహారం అందించాలన్నారు. వారి రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.