బాలచంద్రుని దారుణ హత్యశ్రీఆలస్యంగా వెలుగులోకి…

ప్రభాకరన్‌ కుమారుడ్ని అమానవీయంగా చంపేసిన సైన్యం
శ్రీలంక మానవ హక్కుల ఉల్లంఘనను బయటపెట్టిన మీడియా
కొలంబో, (జనంసాక్షి) :
లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం (ఎల్‌టీటీఈ) అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్‌ కుమారుడు బాలచంద్రన్‌ ప్రభాకరన్‌(12)ను శ్రీలంక సైన్యం అమానవీయంగా మట్టుబెట్టింది. 2009లో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న ఓ ప్రాంతంలో కూర్చుని బిస్కెట్లు తింటున్న బాలచంద్రన్‌పై తుపాకీ ఎక్కుపెట్టింది. చిన్నారి అనే కనికరం కూడా చూపకుండా అత్యంతా దారుణంగా శ్రీలంఖ సైన్యం ప్రవర్తించింది. బాలుడి జీవించే హక్కు హరించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని తనకు తాను చిన్నారికి శిక్ష విధించింది. 2009లో జరిగిన ఈ దురాగతాన్ని బ్రిటన్‌కు చెందిన చానెల్‌-4 మంగళవారం బయటపెట్టింది. బాలచంద్రన్‌ చిన్న బల్లపై కూర్చున్న మొదటి చిత్రం, బిస్కెట్‌ తింటున్న రెండో చిత్రం, అతడిని కాల్చివేసిన మూడో చిత్రాన్ని ఒకే కెమెరాతో చిత్రీకరించినట్టు ఆ చానెల్‌ వర్గాలు పేర్కొన్నాయి.

ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగులు ప్రసారం కావడంతో యావత్‌ ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. శ్రీలంఖ సర్కారు తమిళులకు ప్రత్యేక దేశం కోరుకుంటున్న ఎల్‌టీటీఈని నిషేధిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యతో దీనిపై నిషేధం మరింత తీవ్రతరమైంది. తమిళలు స్వయం ప్రతిపత్తి కోరుకుంటున్నా అక్కడి పాలకులు వారి గొంతులు పెగలకుండా చేశారు.

సైన్యం జరిపిన ఆపరేషన్‌లో ప్రభాకర్‌ కుటుంబాన్ని మట్టుబెట్టిన సైన్యం చివరకు ఆయన కుమారుడు బాలచంద్రన్‌ కూడా అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనను ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కుల సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి. పీఎంకే నేత రామ్‌దాస్‌, తమిళనాడు సీపీఐ నేత పాండ్యన్‌ బాలచంద్రన్‌ హత్యను ఖండించారు. శ్రీలంఖ సైన్యానిది పాశవిక చర్య అని వారు పేర్కొన్నారు. పూర్తి వీడియోను పరిశీలించిన తర్వాత స్పందిస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యాఖ్యానించారు.